ఆ ముగ్గురినీ టీమిండియాకి సెలక్ట్ చేయడం వెనక భారీ ప్లానింగ్... ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు...

First Published Nov 10, 2021, 5:46 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని గ్రూప్ స్టేజ్‌ నుంచే ముగించిన భారత జట్టు, మరో వారం రోజుల్లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది బీసీసీఐ...

న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది...

నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లకు అవకాశం దక్కింది.  ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడింది 10 మ్యాచులే అయినా 370 పరుగులతో పాటు 3 వికెట్లు తీసి అదరగొట్టిన కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌, న్యూజిలాండ్‌తో సిరీస్ ద్వారా ఆరంగ్రేటం చేయనున్నాడు...

ఐపీఎల్ సెకండాఫ్‌లో కేకేఆర్‌కి ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్, 4 హాఫ్ సెంచరీలతో చెలరేగి, కోల్‌కత్తా గ్రాఫ్‌ని పూర్తిగా మార్చేశాడు...

ఫస్టాఫ్ ముగిసేసరికి రెండే విజయాలతో ఏడో స్థానంలో ఉన్న కేకేఆర్, వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి, ఫైనల్ దాకా వెళ్లిందంటే అది వెంకటేశ్ అయ్యర్ చలువే... 

ఫైనల్ మ్యాచ్‌లోనూ అయ్యర్ హాఫ్ సెంచరీ అదరగొట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసి విజయదిశగా వెళ్తున్నట్టే కనిపించింది కేకేఆర్. అయితే అయ్యర్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది...

అలాగే ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేసిన ‘పర్పుల్ క్యాప్’ విజేత హర్షల్ పటేల్‌కి న్యూజిలాండ్‌ సిరీస్‌లో చోటు దక్కింది...

వీరితో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌లో 16 మ్యాచుల్లో 24 వికెట్లు తీసి, 7.37 ఎకానమీ, 18.75 యావరేజ్‌తో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్ కూడా న్యూజిలాండ్ సిరీస్ ద్వారా టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేయనున్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన ప్లేయర్లకు టీమిండియాలో చోటు దక్కడంతో, వీరిని వచ్చే సీజన్ ఐపీఎల్ 2022 మెగా వేలంలో రిటైన్ చేసుకోవడం కాస్ట్‌లీగా మారనుంది...

ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీ ప్రకారం ఓ జట్టు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే మొదటి ప్లేయర్‌కి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.12 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కి రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలనుకుంటే మొదటి ప్లేయర్‌కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.11 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది... అదే అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయితే రూ.4 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది...

ఈ ముగ్గురు ఐపీఎల్ స్టార్లు, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా ఆరంగ్రేటం చేయబోతున్నారు. దీంతో మెగా వేలంలో వీరు అన్‌ క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో ఉండరు. కాబట్టి వీరిని రిటైన్ చేసుకోవాలంటే సదరు జట్లు భారీగా చెల్లించడానికి సిద్ధపడాల్సిందే...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్, పృథ్వీషా, రబాడా లేదా నోకియాలతో పాటు ఆవేశ్ ఖాన్‌ని అట్టిపెట్టుకోవాలంటే అతనికి రూ.6 కోట్లు చెల్లించడానికి సిద్ధపడాల్సిందే...

ఐపీఎల్ 2018 వేలంలో ఆవేశ్ ఖాన్‌ని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే హర్షల్ పటేల్‌ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ... వెంకటేశ్ అయ్యర్ కూడా రూ.20 లక్షలకు కేకేఆర్‌కి దక్కినవాడే...

ఇలాంటి ప్లేయర్లను అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా రూ.4 కోట్లు చెల్లించి అట్టి పెట్టుకోవాలని భావించిన సదరు ఫ్రాంఛైజీలకు న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఊహించని షాక్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు...

click me!