ICC T20 Rankings: దారుణంగా పడిపోయిన విరాట్ కోహ్లి ర్యాంకు.. టాప్ లో పాకిస్థాన్ కెప్టెన్..

First Published Nov 10, 2021, 5:25 PM IST

Virat kohli: టీ20 ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచులలో పేలవ ప్రదర్శన కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమణ బాట పట్టిన టీమిండియాకు.. టీ20 ర్యాంకింగ్సులోనూ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఫార్మాట్ లో ఇండియా టీ20 మాజీ సారథి విరాట్ కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు కిందికి పడిపోయాడు.

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో కోహ్లికి షాక్ తగిలింది. ఇందులో..  కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్న పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ ఎప్పటిలాగే తొలిస్థానాన్ని ఆక్రమించాడు. భారత మాజీ సారథి  కోహ్లి.. ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి.. ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

జాబితాలో.. 839 పాయింట్లతో ఆజమ్ ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్), మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), ఆరోన్ ఫించ్ ఉన్నారు.

ఇక  టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్.. మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్,  డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) ఉండగా.. ఎనిమిదో స్థానంలో విరాట్ ఉన్నాడు. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) , వాన్ డర్ డసెన్ (దక్షిణాఫ్రికా) తొమ్మది, పదో స్థానాల్లో కొనసాగుతున్నారు. 

ఈ మెగా టోర్నీలో మూడు ఇన్నింగ్స్ లలో విరాట్.. 68 పరుగులే చేశాడు. దీంతో కోహ్లి ర్యాంకు పడిపోయింది. ఇక రాహుల్ మాత్రం.. 194 పరుగులతో ఈ టోర్నీలో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. తొలి రెండు మ్యాచులలో విఫలమైన రోహిత్.. అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాతో  మ్యాచ్ లో విజృంభించి ఆడాడు.  

ఇక బౌలర్ల విషయానికొస్తే..  టీ20 ప్రపంచకప్ టోర్నీలో అదరగొట్టిన హసరంగ..797 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. తర్వాత షంషీ (దక్షిణాఫ్రికా), అదిల్ రషీద్ (ఇంగ్లాండ్), రషీద్ ఖాన్ (అఫ్గాన్), ఆడమ్ జంపా (ఆసీస్), ముజీబ్ (అఫ్గాన్) ఉన్నారు. వీళ్లంతా స్పిన్నర్లే కావడం విశేషం.

ఆ తర్వత నలుగురిలో (నార్త్జ్, హెజిల్వుడ్, సౌథీ, జోర్డాన్) అందరూ ఫాస్ట్ బౌలర్లే. ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్-10 లో లేకపోవడం గమనార్హం. 

ఆల్ రౌండర్ల జాబితాలో కూడా ఇండియా నుంచి ఒక్క ఆటగాడు కూడా లేడు. అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ (265 పాయింట్లతో) ప్రథమ స్థానంలో ఉండగా.. హసన్ (బంగ్లాదేశ్), హసరంగ (శ్రీలంక), గ్లెన్ మ్యాక్స్వెల్, మక్సూద్ (ఓమన్) టాప్-5 లో ఉన్నారు. 

click me!