
Sarfaraz Khan : భారత యంగ్ స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్‌లో నాలుగో రోజైన శనివారం (అక్టోబర్ 19) సర్ఫరాజ్ సెంచరీ పూర్తి చేశాడు.
అతని టెస్టు కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్లను చిత్తు చేశాడు. భారత్ కు అత్యంత కీలకమైన సమయంలో అతని సెంచరీ ఇన్నింగ్స్ భారత క్రికెట్ లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు.
నాలుగో టెస్టులో సెంచరీ కొట్టిన సర్ఫరాజ్ ఖాన్
దేశవాళీ క్రికెట్ లో అద్భుతాలు చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ను ఎనిమిది నెలల క్రితం ఇంగ్లండ్‌తో ప్రారంభించాడు. ఫిబ్రవరి 2024లో అరంగేట్రం చేసిన తర్వాత, సెంచరీ చేయడానికి అతనికి 4 మ్యాచ్‌లు పట్టింది. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్లు ఘోరంగా విఫలం కావడంలో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసి 356 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో భారత జట్టు ఒత్తిడిలోకి జారుకుంది.
రెండో ఇన్నింగ్స్ సమిష్టిగా రాణించిన భారత ఆటగాళ్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయడంతో భారత్ పై ఒత్తిడి పెరిగింది. తొలి ఇన్నింగ్స్ తప్పులను చేయకుండా భారత్ రెండో ఇన్నింగ్స్ మొదటి నుంచే దూకుడుగా ఆటను ప్రారంభించింది. క్రీజులోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఇప్పటివరకు మెరుగైన ప్రదర్శన చేశారు.
సెంచరీ హీరో సర్ఫరాజ్ బ్యాటింగ్ కు వచ్చేసరికి భారత జట్టు పటిష్ట స్థితిలో ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మెరుగైన ఆరంభాన్ని అందించారు. భారత్ స్కోరు 92/2కు చేర్చారు. సర్ఫరాజ్ అక్కడి నుంచి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వెటరన్ బ్యాట్స్‌మెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంలో టీమ్‌ఇండియా బలమైన పునరాగమనం చేసింది. యశస్వి 35 పరుగులు, రోహిత్ 52, కోహ్లి 70 పరుగులు చేసి ఔటయ్యారు.
110 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన సర్ఫరాజ్ ఖాన్
మూడో రోజు ఆట ముగిసే సమయానికి సర్ఫరాజ్ 78 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నాలుగో రోజు వర్షంతో మ్యాచ్ ప్రారంభానికి కాస్త అడ్డంకిగా మారింది. ఇక మ్యాచ్ ప్రారంభం అయిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తనదైన బ్యాటింగ్ ను కొనసాగించి 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టిమ్ సౌథీ వేసిన బంతిని కవర్ ఏరియాలో ఫోర్ కొట్టి సెంచరీ ఆనందంతో గంతేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సర్ఫరాజ్ బ్యాట్ ఊపుతూ మైదానాన్ని చక్కర్లు కొట్టాడు. అవతలి ఎండ్‌లో నిలబడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అతన్ని కౌగిలించుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న టీమ్ ఇండియా ఆటగాళ్లంతా లేచి నిలబడి సర్ఫరాజ్‌కు గట్టిగా చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 125 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తన ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతనికి తోడుగా భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ కొట్టాడు. పంత్ తన 53 పరుగుల ఇన్నింగ్స్ 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్
దేశవాళీ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో సర్ఫరాజ్‌కు మంచి పేరుంది. తన చివరి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై ముంబై తరఫున సర్ఫరాజ్ అజేయంగా 222 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సర్ఫరాజ్ ఇప్పటివరకు 51 దేశవాళీ మ్యాచ్‌లను ఆడాడు. ఈ సమయంలో అతను 69.09 సగటుతో 4422 పరుగులు చేశాడు.
అలాగే, 15 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. చాలా కాలంగా భారత జట్టు ఎంట్రీకోసం ఎదురుచూసిన సర్ఫరాజ్ కు ఇంగ్లాండ్-భారత్ సిరీస్ లో అవకాశం దక్కింది. తొలి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ఆటతో రాణించాడు. ఇప్పుడు తన నాల్గో టెస్టు మ్యాచ్ లో సెంచరీ బాదాడు. ఈ టెస్టు సెంచరీ సర్ఫరాజ్‌కు ఆరంభం కాగా, భవిష్యత్తులో టీమిండియా అతని నుంచి భారీ ఇన్నింగ్స్ లను ఆశిస్తోంది.