INDvsENG 2nd Test: లార్డ్స్ టెస్టులో టీమిండియా చారిత్రక విజయం... ఇంగ్లాండ్‌ను చిత్తు చేస్తూ...

First Published Aug 16, 2021, 11:09 PM IST

లార్డ్స్‌ టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. ఆఖరి రోజు ఆఖరి సెషన్ ఆఖరి పది నిమిషాల వరకూ సాగిన ఈ మ్యాచ్‌... క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మాజాని అందించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా...

271 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్లు... పరుగులకి ఆలౌట్ చేశారు. అసలు టీమిండియా గెలుస్తుందా? అనుకున్న మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచి ఘన విజయాన్ని అందుకుంది. 

మొదటి ఓవర్‌లోనే రోరీ బర్న్స్‌ను అవుట్ చేసిన జస్ప్రిత్ బుమ్రా... ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో డొమినిక్ సిబ్లీ కూడా డకౌట్ కావడంతో 1 పరుగుకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. 

అయితే హసీబ్ హమీద్‌తో కలిసి మూడో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ఇంగ్లాండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు కెప్టెన్ జో రూట్. 
షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన హసీబ్ హమీద్, 45 బంతుల్లో 9 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో వికెట్‌కి జానీ బెయిర్‌స్టోతో కలిసి 23 పరుగులు జోడించాడు జో రూట్...

24 బంతుల్లో 2 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో, టీ బ్రేక్ ముందు ఇషాంత్ శర్మ వేసిన ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూ తీసుకున్న విరాట్ కోహ్లీకి అనుకూలంగా ఫలితం వచ్చింది. 

ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో జో రూట్ ఎప్పటిలాగే 60 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసి... టీమిండియా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు. అయితే లంచ్ బ్రేక్ తర్వాతి ఓవర్‌లో జో రూట్‌ను అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా...

జో రూట్ అవుటైన తర్వాత దాదాపు 16 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు మొయిన్ ఆలీ, జోస్ బట్లర్. అయితే ఈ జోడీని సిరాజ్ విడదీశాడు...
42 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే సామ్ కుర్రాన్ కూడా రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చాడు...

2016లో జేమ్స్ అండర్సన్ తర్వాత టీమిండియాపై ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు సామ్ కుర్రాన్. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అవుటైన సామ్ కుర్రాన్, రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

ఆ తర్వాత ఓల్లీ రాబిన్‌సన్, జోస్ బట్లర్ కలిసి వికెట్లకి అడ్డుగా నిలిచారు. దాదాపు 13 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 30 పరుగులు జోడించాడు. 35 బంతుల్లో 9 పరుగులు చేసిన రాబిన్‌సన్‌ను బుమ్రా అవుట్ చేశాడు...
ఆ తర్వాత 96 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన జోస్ బట్లర్‌ను సిరాజ్ అవుట్ చేయడంతో 120 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...

ఆ వెంటనే జేమ్స్ అండర్సన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్... 120 పరుగులకి ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయించాడు. దీంతో భారత జట్టు 151 పరుగుల తేడాత ఘన విజయం అందుకుంది.

click me!