సెంచరీల కోసమే బంగ్లా టూర్‌కి ఆ ముగ్గురూ... విరాట్ కోహ్లీ, రోహిత్, కెఎల్ రాహుల్‌లపై ట్రోలింగ్...

First Published Dec 1, 2022, 2:03 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌ టూర్‌కి దూరంగా ఉన్నారు భారత సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అలాగే వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి కూడా ఈ టూర్ నుంచి రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. ఈ ముగ్గురూ బంగ్లాదేశ్ టూర్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్ చేరుకున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్...

Image credit: PTI

న్యూజిలాండ్ పర్యటనలో టీ20, వన్డే సిరీసుల్లో చోటు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్ స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. వీరి స్థానంలో రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్, షాబజ్ అహ్మద్, ఇషాన్ కిషన్... జట్టుతో కలవబోతున్నారు...

Virat Kohli-Rohit Sharma

న్యూజిలాండ్‌తో సిరీస్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ ఆడడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి. వచ్చే ఏడాది రెండు ప్రధాన ఐసీసీ టోర్నీలు ఆడనుంది భారత జట్టు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సన్నాహకాలను బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ నుంచే మొదలెట్టనుంది రోహిత్ సేన...

అలాగే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది టీమిండియా. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ రెండు టెస్టులను గెలవడం టీమిండియాకి చాలా అవసరం. దీనికి ముందు అవసరమైన ప్రాక్టీస్‌కి వన్డే సిరీస్‌ని వాడుకోబోతున్నారు సీనియర్లు...

అయితే ఫ్యాన్స్ మాత్రం సెంచరీలు చేయడానికే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... బంగ్లా టూర్‌లో ఆడాలని ఫిక్స్ అయ్యారని ఆరోపణలు చేస్తున్నారు. రోహిత్ శర్మ చివరిగా జనవరి 2020లో వన్డే సెంచరీ చేశాడు. రెండేళ్లుగా రోహిత్ బ్యాటు నుంచి వన్డే సెంచరీ రాలేదు... ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ రోహిత్ నిరాశపరిచాడు...

విరాట్ కోహ్లీ మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ సెంచరీ చేసినా... వన్డే, టెస్టుల్లో శతకం బాది చాలా రోజులే అవుతోంది. చివరిగా 2019, ఆగస్టులో 43వ వన్డే సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డు (49 వన్డే శతకాలు) బ్రేక్ చేసేందుకు 7 సెంచరీల దూరంలో ఉన్నాడు...

అలాగే శిఖర్ ధావన్ సెంచరీ చేసి మూడేళ్లు దాటేసింది. చివరిగా 2019 జూన్‌లో వన్డే శతకం బాదిన శిఖర్ ధావన్, ఆ తర్వాత హాఫ్ సెంచరీలు కొడుతున్నా సెంచరీని చేరుకోలేకపోతున్నాడు. దీంతో శిఖర్ ధావన్‌కి వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో చోటు ఉండాలంటే ఇప్పుడు సెంచరీ కొట్టడం అవసరంగా మారిపోయింది...

ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్ పర్యటనలో సెంచరీ చేసి... ఆ ట్రోలింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడట. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లను పక్కనబెట్టి ఈ సీనియర్లు... బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుండడం విమర్శలకు తావిస్తోంది.. 

click me!