కుల్దీప్ యాదవ్‌కి ఈసారైనా చోటు దక్కుతుందా... అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలతో పోటీపడి...

First Published Feb 4, 2023, 12:56 PM IST

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు తీసి, బ్యాటుతో 40+ పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు కుల్దీప్ యాదవ్. అయితే ఇంత చేసినా రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. జయ్‌దేవ్ ఉనద్కట్‌ని టీమ్‌లోకి తెచ్చేందుకు కుల్దీప్ యాదవ్‌ని తుది జట్టు నుంచి తప్పించింది టీమిండియా...

Kuldeep Yadav

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కుల్దీప్ యాదవ్‌కి కూడా చోటు దక్కింది. అయితే ఈసారి అయినా కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడా? అనేది అనుమానంగా మారింది. దీనికి కారణం కుల్దీప్ యాదవ్‌కి తుదిజట్టులోకి రావాలంటే ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లతో పోటీపడాల్సి ఉంటుంది...

రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ స్వదేశంలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నారు. వీరికి తోడు రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని ఆరు నెలల తర్వాత టీమ్‌లో కలవబోతున్నాడు. జడ్డూ బాల్‌తో కాకపోతే బ్యాటుతో రాణించగలడు. రిషబ్ పంత్ లేకపోవడంతో జడ్డూ లోయర్ ఆర్డర్‌లో ఆడే ఇన్నింగ్స్‌లు టీమిండియాకి చాలా కీలకం...

స్వదేశంలో రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌లోనూ అదరగొడతాడు. టెస్టుల్లో అశ్విన్‌కి 5 సెంచరీలు ఉన్న విషయం మరిచిపోకూడదు. అలాగే అక్షర్ పటేల్, టెస్టు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి స్వదేశంలో జరిగిన ప్రతీ టెస్టులోనూ ఐదేసి వికెట్ల నమోదు చేశాడు. ఇండియాలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు తీశాడు అక్షర్ పటేల్...

kuldeep

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2018 టోర్నీలో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కుల్దీప్ యాదవ్. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఎప్పుడు విదేశాల్లో టెస్టులు ఆడినా కుల్దీప్ యాదవ్‌కి తప్పక చోటు ఉంటుందని కామెంట్ చేశాడు అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి... అయితే అలా జరగలేదు...

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత కుల్దీప్ యాదవ్, భారత జట్టుతోనే ట్రావెల్ చేసినా ఆడిన మ్యాచులు వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన కుల్దీప్ యాదవ్, ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడు. మూడో టెస్టు సమయంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా గాయపడి టీమ్‌కి దూరమైనా కుల్దీప్‌కి అవకాశం దక్కలేదు...

బ్రిస్బేన్ టెస్టులో వాషింగ్టన్ సుందర్‌ని తుది జట్టులోకి తెచ్చిన టీమిండియా, కుల్దీప్ యాదవ్‌ని రిజర్వు బెంచ్‌లోనే కూర్చోబెట్టింది. అయితే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకి కుల్దీప్ యాదవ్‌పై నమ్మకం ఎక్కువే. దాంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చు...

స్పిన్‌కి అనుకూలించే పిచ్‌లు కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగుతుంది టీమిండియా. అవసరమైతే శ్రేయాస్ అయ్యర్ కూడా బౌలింగ్ చేస్తాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను దాటుకుని కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వస్తాడా? వస్తే ఎవరి ప్లేస్‌లో వస్తాడనేది ఆసక్తికరంగా మారింది..  

click me!