ఆస్ట్రేలియా ప్లాన్‌కి కౌంటర్ ప్లాన్‌తో టీమిండియా... జయంత్ యాదవ్, పుల్‌కిత్ నారంగ్‌లకు చోటు...

First Published Feb 5, 2023, 2:21 PM IST

టీ20ల్లో ఉండే మజా, టుక్కు టుక్కుమని ఐదు రోజుల పాటు సాగే టెస్టు మ్యాచుల్లో ఉండదని అనుకుంటున్నారు చాలా మంది. అయితే టెస్టుల్లో ఉండే మజా, ఏ ఫార్మాట్‌లోనూ ఉండదు. సెషన్లలో మారిపోయే ఆధిపత్యం, మ్యాచ్ అయిపోయిందనుకునేలోపు ట్విస్టులు, మలుపులు, నఠాలు తెగే ఉత్కంఠ... సంప్రదాయ క్రికెట్‌లో మాత్రం కనిపించే దృశ్యాలు...

ఇండియా, ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్స్ పోటీపడే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి సీన్స్ కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈసారి ఇరుజట్లు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టెస్టు సిరీస్‌లో తలబడుతుండడంతో ఈసారి మజా రెండింతలు కానుంది...

ఇప్పటికే మూడు సీజన్లుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోయిన ఆస్ట్రేలియా, ఈసారి ఇండియాలో టెస్టు సిరీస్ గెలిచేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత యంగ్ స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా పెట్టుకుని, పగుళ్లు తేలిన అతి కఠినమైన స్పిన్ పిచ్‌లపై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది...

అంతేకాదు, భారత జట్టుకి ప్రధాన అస్త్రమైన స్పిన్‌తోనే వారిని ముప్పుతిప్పలు పెట్టాలనే ఆలోచనతో భారత్‌లో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. నాథన్ లయన్‌తో పాటు అస్టన్ అగర్, మిచెల్ స్వీప్సన్, టాడ్ ముర్ఫీ రూపంలో ఒకరికి నలుగురు స్పిన్నర్లు... బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్నారు...

గత సీజన్‌లో ఆస్ట్రేలియాకి గబ్బాలో ఎప్పటికీ మరిచిపోలేని విధంగా దెబ్బ కొట్టిన రిషబ్ పంత్‌, కారు ప్రమాదంలో చిక్కుకోవడంతో అతను ఇప్పుడు టీమ్‌లో లేడు. అజింకా రహానే, పేలవ ఫామ్‌తో టీమ్‌కి దూరమయ్యాడు. జస్ప్రిత్ బుమ్రా గాయంతో తొలి రెండు టెస్టులు ఆడడం లేదు.. దీంతో ఈసారి ఆస్ట్రేలియా ఎలాగైనా టెస్టు సిరీస్‌తో తిరిగి వెళ్లాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది..

అయితే ఆసీస్‌ ప్లాన్‌కి రివర్స్ ప్లాన్‌తో బరిలో దిగుతోంది భారత జట్టు. ఇప్పటికే టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్నర్లుగా ఉన్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, రాహుల్ చాహార్, ఆర్ సాయి కిషోర్ నెట్ బౌలర్లుగా సేవలు అందిస్తున్నారు...

అయితే తాజగా జయంత్ యాదవ్, పుల్‌కిత్ నారంగ్‌లను కూడా నెట్ బౌలర్లుగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వీరితో కలిపి ఏకంగా ఆరుగురు నెట్ స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేయనుంది భారత జట్టు. టీమిండియాలోని ఏ స్పిన్నర్ అయినా గాయంతో జట్టుకి దూరమైతే వీరిని తుదిజట్టులోకి చేర్చే అవకాశాలు ఉంటాయి...
 

click me!