ఆస్ట్రేలియాతో మొదటి టీ20... ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో టీమిండియా..

First Published Sep 20, 2022, 3:28 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు ఆడుతోంది టీమిండియా. 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఆతిథ్యమిస్తున్న ఆసీస్‌ని స్వదేశంలో చిత్తు చేస్తే... రెట్టంపు ఉత్సాహంతో ప్రపంచకప్ బరిలో దిగే అవకాశం ఉంటుంది. అదీకాకుండా ఆసియా కప్ 2022 పరాభవం తర్వాత జరుగుతున్న సిరీస్ కావడంతో రోహిత్ సేనకు ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది...

Bhuvi

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత జట్టును ప్రధానంగా వెంటాడిన సమస్య బౌలర్ల వైఫల్యం. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన భువనేశ్వర్ కుమార్.. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగిన మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో 19 పరుగులు ఇచ్చిన భువీ, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులు సమర్పించుకున్నాడు...

Indian Cricket Team

ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ని కేవలం పవర్ ప్లే బౌలర్‌గానే వాడింది టీమిండియా. నాలుగు ఓవర్ల కోటాని ఆరంభంలోనే పూర్తి చేయించింది. దీంతో డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయగల సరైన బౌలర్‌ అవసరం పడింది టీమిండియా. ఈ రెండు మ్యాచుల్లోనూ 20వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్... చక్కని బౌలింగ్ పర్ఫామెన్స్ కనబరిచాడు. అయితే టీమిండియాకి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. దీంతో అక్కడ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలో దిగే అవకాశం ఉంది భారత జట్టు. అలాగైతే హార్ధిక్ పాండ్యాతో పాటు జస్ప్రిత్ బుమ్రా ఆడడం ఖాయం. అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్... ఈ ముగ్గురిలో ఏ ఇద్దరినీ తీసుకుంటే బెటర్ అనేది ఈ టీ20 సిరీస్‌లో తేల్చుకోవాల్సి ఉంది...

Image credit: PTI

స్పిన్ బౌలింగ్ విభాగం కూడా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. మొదటి నాలుగు మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క వికెట్ తీసిన యజ్వేంద్ర చాహాల్, ఆఖరి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే చాహాల్ నిలకడైన ప్రదర్శన ఇవ్వకపోతే టీమిండియాకి కష్టాలు తప్పవు. ఆఫ్ఘాన్‌పై చూపించిన మ్యాజిక్‌ని ఆసీస్‌పై రిపీట్ చేయాలని చూస్తున్నాడు యజ్వేంద్ర చాహాల్...

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమవ్వడం టీమిండియాకి చాలా పెద్ద లోటు. కాబట్టి జడ్డూ లేని లోటును అక్షర్ పటేల్ ఎంత వరకూ భర్తీ చేయగలడనేది ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా తేలిపోనుంది...
 

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత ఓపెనర్ల నుంచి సరైన పర్ఫామెన్స్ రాలేదు. కెఎల్ రాహుల్ మొదటి నాలుగు మ్యాచుల్లో విఫలమైనా ఆఫ్ఘాన్‌పై హాఫ్ సెంచరీ చేస్తే... రోహిత్ శర్మ, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈ ఇద్దరూ నిలబడి, ఓ 6 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేదు...

Rishabh Pant-Rohit Sharma

కాబట్టి ఓపెనర్ల నుంచి సరైన పర్ఫామెన్స్ రావడం టీమిండియాకి కీలకంగా మారింది. ఆస్ట్రేలియా పిచ్‌ల మీద త్వరగా వికెట్ కోల్పోతే పరుగులు చేయడానికి మిగిలిన బ్యాటర్లు తెగ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి రోహిత్, కెఎల్ రాహుల్‌ని ఓపెనింగ్ చేయిస్తారా? లేక విరాట్ కోహ్లీని ఆ ప్లేస్‌కి ప్రమోట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది...

రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ హయాంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో, టీమ్ కాంబినేషన్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చింది భారత జట్టు. టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతుండడంతో ఓ నిర్ధిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు పర్ఫెక్ట్ టీమ్ కాంబినేషన్‌ని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనే సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నారు అభిమానులు.. 

click me!