South Africa Squad: భారత్ తో టెస్టు సిరీస్ కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. కెప్టెన్ ఎవరంటే..?

First Published Dec 7, 2021, 3:52 PM IST

India Tour Of South Africa: టీమిండియాతో త్వరలో జరుగబోయే టెస్టు సిరీస్ కు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. 21 మందితో కూడుకున్న ఈ జట్టును.. క్రికెట్ సౌతాఫ్రికా మంగళవారం ప్రకటించింది. 

డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరుగనున్న నేపథ్యంలో ప్రొటీస్ టీమ్ 21 మంది సభ్యుల పేర్లను  వెల్లడించింది. డీన్ ఎల్గర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో ఇటీవల ముగిసిన వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కు ఆడిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 

డీన్ ఎల్గర్ సారథ్య బాధ్యతలు మోస్తుండగా.. టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్ గా వ్యవహరించిన టెంబ బవుమా.. వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు.

ఇక దక్షిణాఫ్రికా పేస్ ద్వయం కగిసొ రబాడ,  ఆన్రిచ్ నార్త్జ్  లు తిరిగి జట్టుతో చేరగా.. సీమర్  ఒలివీర్ కూడా స్థానం దక్కించుకున్నాడు. 2019 లో అతడు చివరిసారిగా ఆ జట్టు తరఫున టెస్టులు ఆడాడు. కానీ ఆ తర్వత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. 

కానీ కొన్నాళ్లుగా దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న ఒలివీర్ కు సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఈ ఏడాది  దేశవాళీ క్రికెట్ లో అత్యధిక వికెట్లు (8 ఇన్నింగ్సులలో 28 వికెట్లు) తీసిన  బౌలర్ గా అవతరించిన ఒలివీర్ ను సెలెక్టర్లు కీలక సిరీస్ కు ఎంపికచేశారు.  

వీరితో పాటు గ్లెంటన్ స్టువర్మన్, పెర్నెలన్ సుబ్రయెన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.  అంతేగాక ఇటీవల దేశవాళీ క్రికెట్ లో అదరగొడుతున్న సిసండ మగల,  ర్యాన్ రిక్లెటన్ లకు కూడా పిలుపు అందింది. 
 

దక్షిణాఫ్రికా జట్టు : డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబ బవుమా (వైస్ కెప్టెన్) క్వింటన్ డికాక్ (వికెట్  కీపర్), కగిసొ రబాడ, ఎర్వీ, బ్యూరన్ హెండ్రిక్స్, జార్జ్ లిండె, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, మార్క్రమ్, వియాన్ మల్డర్, ఆన్రిచ్ నార్త్జ్, కీగన్ పీటర్సన్, వాన్ డర్ డస్సెన్, కైల్ వెరీయాన్, మార్కో జాన్సేన్, గ్లెంటన్ స్టువర్మన్, సుబ్రయెన్, సిసండ మగల, ర్యాన్ రికెల్టన్, ఒలీవీర్ 

కాగా.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఈ సిరీస్  వారం రోజుల పాటు ఆలస్యంగా మొదలుకానున్న విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 17 నుంచి సిరీస్ జరగాల్సి ఉన్నా.. దానిని 26 కు మార్చారు.

మూడు టెస్టులు, మూడు వన్డేలు దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత్.. టీ20లను మాత్రం వాయిదా వేసింది. ఒమిక్రాన్ నేపథ్యంలో వీటిని ఇరుజట్ల బోర్డులు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

click me!