Jasprit Bumrah: బుమ్రా లేకున్నా వరల్డ్ కప్ గెలవొచ్చు.. 1992లో అతడు లేకున్నా పాక్ ప్రపంచకప్ నెగ్గలేదా..?

First Published Oct 7, 2022, 2:16 PM IST

T20I World Cup 2022: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకున్నా భారత జట్టు టీ20 ప్రపంచకప్ ను  గెలవచ్చని అంటున్నాడు  మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.   ఇందుకు పాక్ దిగ్గజ బౌలర్ నే ఉదాహరణగా చూపెడుతున్నాడు. 

వెన్నునొప్పి గాయం తిరగబెట్టడంతో   ఈనెల మూడో వారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్ కు దూరమైన  టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత జట్టు ఈ టోర్నీ గెలవచ్చని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. గత ఏడాది కాలంగా బుమ్రా లేకుండానే భారత జట్టు కీలక మ్యాచ్ లను గెలిచిందని తెలిపాడు. 

బుమ్రా లేని లోటు భారత జట్టుపై  ఏ విధంగా పడనుందనే విషయమై క్రిక్ బజ్ షో లో మాట్లాడుతూ జడేజా  పై వ్యాఖ్యలు చేశాడు.  బుమ్రా లేకపోవడం లోటేగానీ  అతడు లేకున్నా ప్రపంచకప్ మీద అంతగా ప్రభావం ఉండదని  చెప్పాడు.  

జడేజా మాట్లాడుతూ.. ‘బుమ్రా లేకపోతే భారత జట్టు ఎలా ఆడబోతుంది అని చెప్పడం  చాలా కష్టమైన  ప్రశ్న. ఆసీస్ వంటి బౌన్సీ పిచ్ లపై   బుమ్రా లాంటి బౌలర్లు తప్పకుండా రాణిస్తారు. కానీ  ప్రస్తుతం అతడు లేడు. కావున ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి.

ఇంకో విషయమేమిటంటే  బుమ్రా గతేడాది కాలంగా  సరిగ్గా  ఆడలేదు. ఏదో కీలక సిరీస్ తప్పితే అతడికి ఎక్కువ విరామమే తీసుకుంటున్నాడు. అతడు లేకున్నా భారత జట్టు మ్యాచ్ లను గెలుస్తోంది. ఆ  లెక్కన చూస్తే భారత జట్టు పెద్దగా ఆందోళన చెందాల్సిన పన్లేదు. బుమ్రాను భర్తీ చేయడం కష్టమే కానీ  అతడు లేకున్నా మ్యాచ్ లను గెలవొచ్చు.. 

ఇందుకు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పదలుచుకున్నా.  ఈ విషయం మనలో చాలా మందికి నచ్చకపోవచ్చు.  అంతేగాక ఈ జనరేషన్ కు తెలియకపోవచ్చు. సరిగ్గా 30 ఏండ్ల కిందట  విషయమిది. అది 1992 వన్డే ప్రపంచకప్.  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోనే జరిగింది.  

ఆ టోర్నీకి ముందు పాకిస్తాన్ జట్టు ప్రధాన బౌలర్ గా ఉన్న వకార్ యూనిస్.. గాయం కారణంగా  వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటికీ పాకిస్తాన్ తరఫున ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ వంటి దిగ్గజ బౌలర్లున్నా  యూనిస్ కూడా తానెంత ప్రత్యేక బౌలరో నిరూపించుకున్నాడు. 
 

 బుమ్రా మాదిరే అతడు కూడా దూకుడైన బౌలర్. బుమ్రా వలే ఆ ప్రపంచకప్ లో కూడా వకార్ వెన్నునొప్పితోనే దూరమయ్యాడు.  కానీ   అతడు లేకున్నా పాకిస్తాన్ 1992 వన్డే ప్రపంచకప్ నెగ్గిందనే విషయాన్ని మనం మరువరాదు..’ అని జడేజా చెప్పడం విశేషం 

click me!