రోహిత్ శర్మకు మళ్లీ గాయం... మూడో టీ20లో 5 బంతులాడి రిటైర్ హర్ట్‌గా పెవిలియన్‌కి...

First Published Aug 2, 2022, 11:51 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ గాయాల కారణంగా ఈ ఏడాది ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది టీమిండియా. సౌతాఫ్రికా టూర్‌కి ముందు గాయపడిన రోహిత్ శర్మ, కరోనా బారిన పడి ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు కూడా ఆడలేదు...

తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ అర్ధాంతరంగా క్రీజు వీడి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరడం.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌ని కలవరబెడుతోంది...

5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అల్జెరీ జోసఫ్ వేసిన రెండో ఓవర్‌లో తొలి బంతికి అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ తర్వాత మూడో బంతికి చూడచక్కని ఫోర్ వచ్చింది..

Image credit: Getty

అయితే ఈ షాట్ ఆడే సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాలు పట్టేశాయి. ఆ తర్వాతి బంతి తర్వాత ఫిజియోని పిలిపించి కాసేపు మాట్లాడిన రోహిత్, నడవడానికి ఇబ్బంది పడుతూ పెవిలియన్ చేరడం కనిపించింది...

రోహిత్ శర్మను ఈ హర్మ్‌స్ట్రింగ్ గాయం సమస్య చాలా ఏళ్లుగా వేధిస్తోంది. ఈ గాయం కారణంగానే ఐపీఎల్ 2020 సీజన్‌లో కొన్ని మ్యాచులు దూరమైన రోహిత్ శర్మ, పూర్తిగా మానకముందే మళ్లీ బరిలో దిగి ఆస్ట్రేలియా టూర్‌లో వైట్ బాల్ సిరీస్‌కి దూరమయ్యాడు...

సౌతాఫ్రికా టూర్‌కి ముందు ఎన్‌సీఏలో నెట్ సెషన్స్‌లో పాల్గొంటున్న సమయంలో మరోసారి తొడ కండరాలు పట్టేయడం... దాంతో రోహిత్ శర్మ సఫారీ టూర్‌కి దూరంగా ఉండడం... కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం జరిగిపోయాయి...

తొడ కండరాల గాయమైతే దాని నుంచి కోలుకోవడానికి 5 నుంచి 8 వారాల సమయం పడుతుంది. మరో 20 రోజుల్లో ఆసియా కప్ 2022 టోర్నీ ఆడాల్సి ఉంది టీమిండియా. ఆ తర్వాత మూడు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఆరంభం కానుంది...

కీలక టోర్నీలకు ముందు రోహిత్ శర్మ గాయపడ్డాడనే వార్త, టీమిండియా ఫ్యాన్స్‌ని కలవరబెడుతోంది. కెప్టెన్‌గా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న రోహిత్, కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టైటిల్ అందిస్తాడని బోలెడు ఆశలు పెట్టుకున్నారు టీమిండియా ఫ్యాన్స్, బీసీసీఐ... 

click me!