డ‌బుల్ ధ‌మాకా.. తిల‌క్ వ‌ర్మ‌-సంజూ శాంస‌న్ సూప‌ర్ సెంచ‌రీలు

First Published | Nov 15, 2024, 10:46 PM IST

IND vs SA : దక్షిణాఫ్రికాతో జ‌రిగిన నాల్గో టీ20 మ్యాచ్ లో భార‌త్ సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించింది. తిల‌క్ వ‌ర్మ‌, సంజూ శాంస‌న్ సౌతాఫ్రికా బౌలింగ్ ను ఉతికిపారేశారు. డ‌బుబ్ సెంచ‌రీలలో స‌రికొత్త రికార్డు సృష్టించారు. 
 

Tilak Varma, Sanju Samson, IND vs SA

IND vs SA: బాల్ వ‌చ్చిందా.. కొడితే బౌండ‌రీ దాటాలిస్తే.. మ్యాచ్ కు ముందు ఇదే అనుకున్నారో ఏమో కానీ, భార‌త ఆట‌గాళ్లు గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన వెంట‌నే సౌతాఫ్రికా బౌలింగ్ ను ఉతికిపారేశారు. క్రికెట్ లో ఆకాశ‌మే హ‌ద్దు అంటే ఏంటో చూపించారు. బౌండ‌రీల వ‌ర్షం కురిపిస్తూ తిల‌క్ వ‌ర్మ‌, సంజూ శాంస‌న్ సెంచ‌రీల మోత మోగించారు. ఒకే మ్యాచ్ లో డ‌బుల్ సెంచ‌రీల రికార్డుతో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. 

Sanju and Tilak

తిల‌క్ వ‌ర్మ‌, సంజూ శాంస‌న్ ప‌రుగుల సునామీ

భారత్-దక్షిణాఫ్రికా మధ్య T20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో నాలుగో, చివరి మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు త‌న విశ్వ‌రూపం చూపించింది. ప్రారంభంలో అభిషేక్ శ‌ర్మ కొద్దిసేపే క్రీజులో ఉన్న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. ఆ త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ‌, సంజూ శాంస‌న్ ప‌రుగుల సునామీ సృష్టించారు. 


సంజూ శాంసన్-తిలక్ వర్మ టీ20 క్రికెట్ రికార్డు భాగస్వామ్యం 

ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచి ఫుల్ జోష్‌లో ఉన్న అభిషేక్ శ‌ర్మ 36 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. అభిషేక్ శర్మ ఔటైనా భారత బ్యాటింగ్‌కు పెద్దగా తేడా లేదు. శాంసన్, తిలక్ తమ సునామీ బ్యాటింగ్‌ను కొనసాగించి 12వ ఓవర్‌లోనే భారత్ స్కోరును 150 మార్కును దాటించారు. 12 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 162 పరుగులకు చేరుకుంది. 20 ఓవ‌ర్ల‌లో భార‌త్ ఒక వికెట్ కోల్పోయి 283 ప‌రుగులు చేసింది. సంజూ-తిల‌క్ 210 ప‌రుగుల భాగ‌స్వామ్యంతో కొత్త రికార్డు న‌మోదుచేశారు. 

sanju samson

సెంచ‌రీతో సంజూ శాంస‌న్ అద‌ర‌గొట్టేశాడు..

తొలి మ్యాచ్ లో సెంచ‌రీ కొట్టిన సంజూ శాంస‌న్ ఆ త‌ర్వాతి రెండు మ్యాచ్ ల‌లో సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యాడు. కానీ, ఈ సిరీస్ లో చివ‌రి-4వ మ్యాచ్ లో సెంచ‌రీతో దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్రికన్ బౌలర్లను చిత్తు చేస్తూ సంజూ శాంసన్  కేవ‌లం 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. మొత్తంగా 51 బంతుల్లోనే సంజూ శాంసన్ 100 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో ఇది సంజూ శాంస‌న్ కు రెండో సెంచ‌రీ కాగా, అత‌ని చివ‌రి 5 T20 ఇన్నింగ్స్‌లలో 3వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ మ్యాచ్ లో 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109* పరుగులు చేశాడు. 

Tilak Varma

తిల‌క్ వ‌ర్మ బ్యాక్ టూ బ్యాక్ సెంచ‌రీలు 

సెంచూరియన్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగిన తెలుగు ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ.. నాల్గో మ్యాచ్ లో కూడా సెంచ‌రీతో అద‌రిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మకు ఇది బ్యాక్ టు బ్యాక్ సెంచరీ.  తిలక్ తన 2వ T20I సెంచరీ కోసం 41 బంతులు తీసుకున్నాడు.  తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 120* పరుగులు చేశాడు. ఈ సెంచ‌రీతో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు బాదిన ప్లేయ‌ర్ గా కూడా తిల‌క్ వ‌ర్మ ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్ లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు సాధించిన భారత ప్లేయ‌ర్లు ఇద్ద‌రు ఉన్నారు. వారే నేడు సెంచ‌రీలు కొట్టిన సంజూ శాంస‌న్, తిల‌క్ వ‌ర్మ‌.

Latest Videos

click me!