Heinrich Klaasen, Varun Chakaravarthy
Heinrich Klaasen Varun Chakaravarthy: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ క్రికెట్ లవర్స్ మస్తు మజాను అందిస్తోంది. మరీ ముఖ్యంగా సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ లో జరిగిన మూడో టీ20 మ్యాచ్ అభిమానులను ఉత్కంఠ రేపుతూ సూపర్ థ్రిల్ ను అందించింది. అర్థరాత్రి ఫోర్లు, సిక్సర్ల వర్షంలో ఇరు జట్ల ప్లేయర్లు క్రికెట్ లవర్స్ ను తడిపారు.
ఈ మ్యాచ్ లో టీమిండియా ఈజీగానే గెలుస్తుందని భావించారు. కానీ, సౌతాఫ్రికా భారత్ ను ఓడించినంత పనిచేసింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్ మధ్యలో దక్షిణాఫ్రికా పేలుడు బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ అదిరిపోయే సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్ మొత్తంగా సౌతాఫ్రికాను భయపెట్టిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో వరుస బౌండరీలు బాదాడు. అందరి కళ్లు బైర్లు కమ్మేలా హ్యాట్రిక్ సిక్సర్లతో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు.
రెండో టీ20లో చక్రవర్తి వలలో చిక్కుకున్న హెన్రిచ్ క్లాసెన్
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి అద్భుత స్పిన్ తో అదరగొట్టాడు. సౌతాఫ్రికా ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని ముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను బలవంతంగా మోకరిల్లారు. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవలేక పోయినా చక్రవర్తి మాత్రం అద్భుత బౌలింగ్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. తన కెరీర్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదుచేశాడు. అతను బలితీసుకున్న ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లలో హెన్రిచ్ క్లాసెన్ ఒకరు. కేవలం 2 పరుగుల వద్ద క్లాసెన్‌ను చక్రవర్తి అవుట్ చేశాడు.
మూడో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తికి దిమ్మదిరిగే షాకిచ్చిన హెన్రిచ్ క్లాసెన్
రెండో టీ20 లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కేవలం రెండు పరుగులకే ఔట్ అయిన హెన్రిచ్ క్లాసెన్.. మూడో మ్యాచ్ లో అతనిపై ఎదురుదాడి చేశాడు. ఆకలితో ఉన్న సింహంలా వరుణ్ చక్రవర్తిపై క్లాసెన్ విరుచుకుపడ్డాడు. అతని బౌలింగ్ లో మూడు బంతుల్లోనే హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. నాల్గవ బంతికి కూడా బిగ్ షాట్ ఆడాడు. చక్రవర్తి మళ్లీ క్లాసెన్ చేతిలో ఓడిపోయాడు, కానీ అదృష్టం అతనికి అనుకూలంగా మారింది. బంతి సూర్య చేతిలో నుండి జారిపోయింది. ఆ తర్వాతి బంతికి క్లాసెన్ ఫోర్ కొట్టి, చివరి బంతికి సింగిల్ తో ఓవర్ ముగించాడు. చక్రవర్తి వేసిన ఓవర్‌లో క్లాసెన్ 23 పరుగులు చేశాడు.
3వ టీ20లో టీమిండియాదే ఆధిపత్యం కానీ..
మూడో టీ20లో ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యం కనిపించింది. టీమిండియా యంగ్ ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ 56 బంతుల్లో 107 పరుగులతో తన తొలి సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా అభిషేక్ శర్మ కూడా 200 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేస్తూ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా టీమిండియా ఆతిథ్య జట్టుకు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ప్రతిస్పందనగా, ఆఫ్రికన్ జట్టు టాపార్డర్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయింది. కానీ, హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ సౌతాఫ్రికా వైపు మళ్లింది. అతను ఔట్ అయిన తర్వాత భారత్ ఈజీగానే గెలుసుందని అందరూ భావించారు. ఎందుకంటే అప్పటికే సాధించాల్సిన రన్ రేటు 16 దాటింది. కానీ, చివరలో మార్కో జాన్సెన్ అద్భుతమైన బ్యాటింగ్ తో మన ఫాస్ట్ బౌలర్ల ఓవర్లలో పరుగుల వరద పారించాడు. 17 బంతుల్లో 54 పరుగుల ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. భారత్ ను ఓడించినంత పనిచేశాడు కానీ, సౌతాఫ్రికాకు విజయాన్ని అందించలేకపోయాడు. 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. 11 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ను ఓడిపోయింది. దీంతో భారత్ ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.