IND vs SA: యువరాజ్- రోహిత్ ఎవ్వరినీ వదలలేదు.. తుఫాను సెంచరీతో సంజూ శాంసన్ రికార్డుల మోత

First Published | Nov 9, 2024, 1:18 AM IST

Sanju Samson Century Records : ప్ర‌స్తుతం టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద్భుత‌మైన సెంచ‌రీ కొట్టాడు. దీంతో లెజెండ‌రీ ప్లేయ‌ర్లు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ల రికార్డులు బ్రేక్ చేశాడు. 
 

Sanju Samson Century Records: డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదిక‌గా దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య జరిగిన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. త‌న సూప‌ర్ ఫామ్ ను కొనాగిస్తూ సెంచ‌రీ కొట్టాడు. ఓపెనర్‌గా భార‌త ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఈ వికెట్ కీప‌ర్ ఈ బ్యాట్స్‌మెన్.. ఆతిథ్య జ‌ట్టు బౌలర్లపై విరుచుకుపడి టీ20 ఇంటర్నేషనల్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు.

సంజూ శాంసన్ బ్యాట్ నుండి 107 పరుగుల అద్భుతమైన సెంచ‌రీ ఇన్నింగ్స్  వ‌చ్చింది. అత‌ను త‌న ఇన్నింగ్స్ లో ఫోర్లు, సిక్సర్లతో అభిమానుల‌ను ప‌రుగుల వ‌ర్షంలో ముంచాడు. ఈ ఇన్నింగ్స్‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శర్మ, లెజెండ‌రీ భార‌త ఆల్ రౌండ‌ర్ యువరాజ్ సింగ్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను అధిగ‌మించి సంజూ శాంసన్ త‌న పేరు మీద అనేక రికార్డులు సృష్టించాడు.

డర్బన్‌లో సంజూ శాంస‌న్ తుఫాను

అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కి వచ్చిన సంజూ శాంసన్.. ఫోర్లు, సిక్సర్లతోనే సౌతాఫ్రికా బౌల‌ర్ల‌కు స‌మాధాన‌మిచ్చాడు. కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఈ పేలుడు బ్యాట్స్ మెన్ 107 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అభిమానులకు ప‌రుగుల వ‌ర్షంలో డ్యాన్స్ చేసేలా చేశాడు. ఇది సంజూ శాంస‌న్ కు వరుసగా రెండో సెంచరీ.

Latest Videos


Sanju Samson-Rohit Sahrma

రోహిత్ శ‌ర్మ‌ రికార్డును సమం చేసిన సంజూ శాంస‌న్

దక్షిణాఫ్రికాపై టీ20లో భారత్‌ చేసిన వేగవంతమైన సెంచరీని సంజూ శాంస‌న్ న‌మోదుచేశాడు. అలాగే, భారతదేశం తరపున అంతర్జాతీయ T20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ రికార్డును కూడా సమం చేశాడు. 22 డిసెంబర్ 2017న ఇండోర్‌లో శ్రీలంకపై 118 పరుగుల ఇన్నింగ్స్‌లో రోహిత్ 10 సిక్సర్లు బాదాడు. కేవలం 43 బంతుల్లో ఆ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు కూడా బాదాడు.

రోహిత్ శ‌ర్మ‌ రికార్డు బద్దలైంది

దక్షిణాఫ్రికాతో జరిగిన పురుషుల టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ భారత బ్యాట్స్‌మెన్‌గా అత్యధిక స్కోరు సాధించాడు. దీనికి ముందు 2015లో ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియంలో 106 పరుగుల ఇన్నింగ్స్ ఆడి రోహిత్ శర్మ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Sanju Samson

ఇది కాకుండా, దక్షిణాఫ్రికా గడ్డపై పురుషుల T20Iలో అత్యధిక స్కోరు సాధించిన భారతీయుడిగా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. గతేడాది డిసెంబర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో 100 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ పేరిట ఈ రికార్డు ఉంది.

యువరాజ్ సింగ్‌ను అధిగ‌మించిన సంజూ శాంస‌న్

ఈ సూప‌ర్ సెంచ‌రీ ఇన్నింగ్స్‌లో శాంసన్ ఒక విషయంలో యువరాజ్ సింగ్‌ను కూడా అధిగ‌మించాడు. T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ స్పిన్‌కు వ్యతిరేకంగా అత్యధిక పరుగులు చేసిన విష‌యంలో సంజూ శాంసన్ భార‌త స్టార్ మాజీ ఆల్ రౌండ‌ర్ యువరాజ్‌ను అధిగ‌మించాడు. 

ఈ మ్యాచ్‌లో శాంసన్ 27 బంతులు ఎదుర్కొని స్పిన్‌కు వ్యతిరేకంగా 58 పరుగులు చేశాడు. 2012లో పాకిస్థాన్‌పై స్పిన్‌కు వ్యతిరేకంగా యువరాజ్ 24 బంతుల్లో 57 పరుగులు చేశాడు.

Sanju Samson

సౌతాఫ్రికాపై టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ 

T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడించి టీమిండియా దక్షిణాఫ్రికాకు పెద్ద గాయ‌మే చేసింది.  దానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని చూసిన ప్రోటిస్ జ‌ట్టుకు మ‌రోసారి షాకిచ్చింది భార‌త్. అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు అదే గాయంపై కారం చ‌ల్లింది.  

తొలి టీ20లోనే సౌతాఫ్రికా స్వదేశంలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాపై భారత్‌ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ల దెబ్బకు ప్రోటీస్ జట్టులోని పెద్ద-పేరున్న ఆటగాళ్లు స్వ‌దేశంలో చేతులెత్తేశారు. 

భారత్ వైపు నుంచి అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. స్వింగ్ మాస్టర్ అర్ష్‌దీప్ సింగ్ శుభారంభం చేసిన తర్వాత వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ప్రత్యర్థి జట్టు ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరూ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

click me!