Rishabh Pant, Sarfaraz Khan
India vs New Zealand : న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారత్ కు బిగ్ షాక్ ఇచ్చింది. 8 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ 402 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ అద్భుత పునరాగమనం చేస్తూ 460 పరుగులు చేసి కివీస్ జట్టుపై 106 పరుగుల ఆధిక్యం సాధించింది. 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమికి కారణాలు ఏమిటి?
బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. తొలి టెస్టులో ఐదో, చివరి రోజైన ఆదివారం న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ గెలిచింది. అంతకుముందు, భారత్‌లో 1989లో ముంబైలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
బెంగళూరు టెస్టులో భారత్ ఉంచిన 107 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ సులువుగా ఛేదించింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి పుణెలో జరగనుంది. బెంగళూరు టెస్టులో భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ వివరాలు గమనిస్తే..
1. వర్ష ప్రభావ వావరణ పరిస్థితుల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయడం
బెంగళూరు టెస్టును తొలి రోజు వర్షం దెబ్బకొట్టింది. ఇక రెండో రోజు అడపాదడపా వర్షం కురుస్తుండడంతో పాటు మేఘావృతమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరు టెస్టు రెండో రోజు టాస్ జరగగా, కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
వర్షపడే పరిస్థితుల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణయం న్యూజిలాండ్‌కు అనుకూలిచింది. ఫలితంగా బెంగళూరు పిచ్‌పై ఉన్న తేమ, మేఘావృతమైన వాతావరణ పరిస్థితులను న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.
2. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ (13), రోహిత్ శర్మ (2), విరాట్ కోహ్లీ (0), సర్ఫరాజ్ ఖాన్ (0), రిషబ్ పంత్ (20), కెఎల్ రాహుల్ (0), రవీంద్ర జడేజా (0), రవిచంద్రన్ అశ్విన్ (0), జస్ప్రీత్ బుమ్రా . (1), కుల్దీప్ యాదవ్ (2) వంటి ఆటగాళ్లు కివీస్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు.
న్యూజిలాండ్ తరఫున మ్యాట్ హెన్రీ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. విలియం ఒరూర్కే 4 వికెట్లు తీశాడు. టిమ్ సౌథీకి ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి.
Rishabh Pant
3. ప్లెయింగ్ 11 లో ముగ్గురు స్పిన్నర్లు
బెంగళూరు టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద తప్పిదం చేశాడు. బెంగళూరు టెస్టులో మేఘావృతమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్‌కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అవసరం, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ అలా చేయకుండా పెద్ద తప్పు చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోలేదు. అతన్ని బెంచ్ కే పరిమితం చేశాడు. అతని స్థానంలో చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నాడు. బెంగళూరులో మేఘావృతమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం భారత జట్టుకు భారీ నష్టం కలిగించింది.
4. టిమ్ సౌథీ-రచిన్ రవీంద్రల భారీ భాగస్వామ్యం
భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 7 వికెట్లను 233 పరుగులకే తీసుకున్నారు. ఇక్కడ న్యూజిలాండ్ జట్టు 300 పరుగుల లోపే ఆలౌట్ అయి వుంటే భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధారంగా కేవలం న్యూజిలాండ్ ఆధిక్యం తగ్గేది. కానీ, టిమ్ సౌథీ, రచిన్ రవీంద్ర భాగస్వామ్యం భారత్‌ను దెబ్బతీసింది.
టిమ్ సౌథీ, రచిన్ రవీంద్ర కలిసి ఎనిమిదో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. రచిన్ రవీంద్ర 134 పరుగులు చేయగా, టిమ్ సౌథీ 65 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 402 పరుగులు చేసి భారత్‌పై 356 పరుగుల ఆధిక్యం సాధించింది.
5. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 54 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది
రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ కలిసి భారత ఇన్నింగ్స్ కు ప్రాణం పోశారు. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగులు జోడించి న్యూజిలాండ్‌పై భారత్‌కు ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 99 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.
సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయినప్పుడు, న్యూజిలాండ్‌పై భారత్ ఆధిక్యం 52 పరుగులు. సర్ఫరాజ్ ఖాన్ తర్వాత రిషబ్ పంత్ (99) అవుటైనప్పుడు, కనీసం భారత్‌ను పోరాట లక్ష్యానికి తీసుకెళ్లే బాధ్యత మొత్తం కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాపై ఉంది. ఈ కీలక సమయంలో కేఎల్ రాహుల్ 12 పరుగుల వద్ద ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ అవుటైన వెంటనే భారత్ ఇన్నింగ్స్ మొత్తం కుప్పకూలింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 54 పరుగులకే చివరి 7 వికెట్లు కోల్పోయింది. 408/4 స్కోరుతో ఉన్న భారత్ చివరకు 462 పరుగులకు కుప్పకూలింది. దీంతో 107 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఈజీగా ఛేదించింది.