అదే పన్లో ఉన్నా.. ఒక్క ఇన్నింగ్స్ అదరగొడితే ఇక మనల్ని ఆపేదెవడు? కివీస్ తో టెస్టులకు ముందు నయా వాల్ కామెంట్స్

First Published Nov 23, 2021, 4:00 PM IST

India Vs New Zealand Test: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా బుధవారం నుంచి  టీమిండియా.. న్యూజిలాండ్ ను ఢీకొనబోతున్నది. భారత టెస్టు సారథి విరాట్ కోహ్లి గైర్హాజరీలో జరుగుతున్న తొలి టెస్టులో తాను పూర్వపు ఫామ్ ను అందుకుంటానని నయా వాల్ పూజారా అంటున్నాడు. 

న్యూజిలాండ్ కు టీ20లలో చుక్కలు చూపించిన టీమిండియా..  గురువారం నుంచి టెస్టు సిరీస్ ఆడనున్నది. కాన్పూర్ వేదికగా జరిగే  తొలి టెస్టుకు అజింకా రహానే సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ టెస్టుకు ‘నయా వాల్’ ఛటేశ్వర్ పూజారా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 

అయితే గత కొద్దికాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న పూజారా ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో టచ్ లోకి వచ్చినట్టే కనిపించాడు. అతడితో పాటు కెప్టెన్  రహానే ఫామ్, టెస్టుకు సంబంధించిన ఆసక్తికర విషయాలపై పూజారా మీడియాతో మాట్లాడాడు. 

టెస్టులలో పూజారా సెంచరీ చేయక రెండేండ్లు గడిచిపోయింది. చివరిసారి అతడు 2019లో ఆస్ట్రేలియా పర్యటనలో  వంద పరుగులు చేశాడు. సిడ్నీలో జరిగిన టెస్టులో అతడు (2019, జనవరి 3న) 193 పరుగులు  చేశాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా (1,055 రోజులు) సెంచరీ చేయలేదు. ఇటీవల ఇంగ్లాండ్ తో లార్డ్స్ టెస్టులో సెంచరీ చేరువదాకా వచ్చినా ఔటయ్యాడు. 

ఇదే విషయమై పూజారా మాట్లాడుతూ.. ‘దాని  (సెంచరీ) గురించి నేను ఆలోచించడం లేదు. నేను 50-60 పరుగులు  సాధిస్తున్నాను.  సెంచరీలు చేయకపోవడం పై నేను బాధపడటం లేదు. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు.. అదీగాక ఇప్పుడు భారత్ లో ఆడుతున్నాం కాబట్టి త్వరలోనే నా నుంచి సెంచరీ చూడొచ్చు..’ అని అన్నాడు. 

ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు ఎనిమిది ఇన్నింగ్స్ లలో నాలుగు సెంచరీలు బాదిన పూజారా.. ఆ తర్వాత  మూడంకెల స్కోరు చేయడమే గగనమైపోయింది. 2019 జనవరి నుంచి ఇప్పటిదాకా పూజారా ఏకంగా 22 టెస్టులు (20 ఇన్నింగ్స్ ) ఆడాడు.  ఇందులో ఒక్క సెంచరీ కూడా లేదు. రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. 

అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ లో తన ఆలోచనా విధానం మారిందన పూజారా అన్నాడు. ఆ సిరీస్ నుంచి తాను భయం లేకుండా ఆడుతున్నానని చెప్పాడు. ‘ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ నుంచి నా ఆలోచనా విధానం మారింది. నేను ఏమాత్రం బెరుకు లేకుండా ఆడాను. నా బ్యాటింగ్ లో చేసిన టెక్నికల్ మార్పులేమీ లేవు. ఇక రాబోయే  కివీస్ సిరీస్ లో కూడా అదే విధంగా ఆడాలని ఆడుకుంటున్నా. అందుకోసం నా సన్నద్ధత కూడా బాగుంది..’ అని చెప్పాడు. 

తొలి టెస్టుకు విరాట్ కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో రహానే సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. పూజారా వైస్ కెప్టెన్సీ చేస్తున్నాడు. అయితే అదనపు బాధ్యతలు తన బ్యాటింగ్ పై ప్రభావం చూపవని అతడు చెప్పాడు. 

ఇక రహానే ఫామ్ గురించి మాట్లాడుతూ.. ‘రహానే అద్భుతమైన ఆటగాడు. ప్రతి ఆటగాడు  తన కెరీర్ లో కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటాడు. అది ఆటలో భాగం. ఆటలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ రహానే ఈసారి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తన ఫామ్ ను అందుకోవడానికి నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

ఫామ్ పొందడానికి ఒక్క ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడు. ఒకసారి అతడు పరుగులు సాధించడం  మొదలుపెడితే ఇక అతడిని ఎవరూ ఆపలేరు.. రాబోయే సిరీస్ లో అతడి  భారీగా పరుగులు సాధిస్తాడని నేను ఆశిస్తున్నాను..’ అని అన్నాడు. 

click me!