చెన్నై టెస్టులో భారత్ సూప‌ర్ విక్ట‌రీ.. రవిచంద్రన్ అశ్విన్ అదిరిపోయే ఆల్ రౌండ్ షో

First Published | Sep 22, 2024, 1:02 PM IST

IND vs BAN: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చెన్నై టెస్టులో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ ను చిత్తుచేస్తూ ఏకంగా 280 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.
 

Indian Win vs Bangladesh

IND vs BAN: చెన్నై టెస్టులో భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో బ్యాటింగ్, బౌలింగ్ అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీలతో బంగ్లాదేశ్ ముందు భార‌త్ భారీ టార్గెట్ ను ఉంచింది. అంత‌కుముందు బ్యాటింగ్‌తో  అద‌ర‌గొట్టిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్ సూప‌ర్ బౌలింగ్ బంగ్లా టీమ్ ను దెబ్బ‌కొట్టి భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు.

Ashwin

ఇండియా ఆల్ రౌండ్ షో

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చెన్నై టెస్టులో ఆల్ రౌండ్ షో చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చింది. చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఇప్పుడు 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

515 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో 82 పరుగుల స్కోరు చేసినా జ‌ట్టును ఓట‌మి నుంచి తప్పించ‌లేక‌పోయాడు.


Rohit Sharma-Mohammed Siraj

భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీసుకున్నారు.  4 వికెట్లు కోల్పోయి 158 పరుగుల స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి సెషన్‌లో 76 పరుగులు జోడించిన తర్వాత మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది.

రవిచంద్రన్ అశ్విన్ సంచలనం

స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత్‌కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్ అని మ‌రోసారి నిరూపించుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్‌తో అద్భుతాలు చేసి 113 పరుగులతో  సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. దీనికి తోడుగా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్‌లో కూడా అద్భుతాలు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

రవిచంద్రన్ అశ్విన్ గొప్ప రికార్డు 

రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 37వ సారి ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు పైగా తీసి గొప్ప రికార్డు సృష్టించాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసి 5 వికెట్లకు పైగా తీసిన రవిచంద్రన్ అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ రికార్డును రవిచంద్రన్ అశ్విన్ సమం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 101 టెస్టుల్లోనే 37 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. దీని కోసం ఆస్ట్రేలియా గ్రేట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 145వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. 

టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 5 వికెట్లు సాధించిన బౌల‌ర్లు వీరే 

67 - మురళీధరన్ (133 టెస్టులు)

37 - ఆర్ అశ్విన్ (101 టెస్టులు) *

37 - షేన్ వార్న్ (145 టెస్టులు)

36 - రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్టులు)

35 - అనిల్ కుంబ్లే (132 టెస్టులు)

అశ్విన్ సెంచరీతో దుమ్మురేపాడు 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. భారత్ తరఫున ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 113 పరుగులు చేశాడు. అలాగే, రవీంద్ర జడేజా 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌ తరఫున హసన్‌ మహమూద్‌ తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. దీంతో పాటు నహిద్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ చెరో ఒక్కొ వికెట్ తీశారు. 

భార‌త్ ముదు మోకరిల్లిన‌ బంగ్లాదేశ్‌ 

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు 149 పరుగులకు ఆలౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ అత్యధికంగా 32 పరుగులు చేశాడు. 

ఇక భారత్ 4 వికెట్లకు 287 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అత్యధికంగా అజేయంగా 119 పరుగులు చేశాడు. అలాగే, రిషబ్ పంత్ 109 పరుగుల సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. 515 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఇప్పుడు 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

Latest Videos

click me!