ఇదెక్క‌డి విచిత్రం మామా.. బంగ్లాదేశ్‌కు ఫీల్డ్ సెట్ చేసిన రిష‌బ్ పంత్

First Published Sep 22, 2024, 9:52 AM IST

Rishabh Pant Viral: రిషబ్ పంత్ చెన్నైలో తన ఆరో టెస్ట్ సెంచరీని సాధించి ఎంఎస్ ధోని సెంచ‌రీల రికార్డును స‌మం చేశాడు. పంత్, శుభ్‌మన్ గిల్‌ల సెంచరీలతో బంగ్లాదేశ్ ముందు భార‌త్ 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పంత్ ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఫీల్డ్ సెట్ చేయ‌డం వైర‌ల్ గా మారింది.
 

Rishabh Pant, Pant

Rishabh Pant Viral:  భార‌త స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్  రిషబ్ పంత్ ఒక ఫైటర్ అలాగే ఒక ఎంటర్టైనర్ కూడా. బంగ్లాదేశ్‌తో చెన్నైలో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో భార‌త్ కు భారీ స్కోర్ ను అందించిన పంత్ స్టంప్‌ల వెనుక ఉన్నపుడు కొంచెం చీకుగా ఉండే అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అలాగే, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా అలాంటిదే క‌నిపించింది. 3వ రోజు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో క‌ష్టాన్ని చూసిన రిషబ్ పంత్ అత‌ను బ్యాటింగ్ చేస్తూ బంగ్లా టీమ్ ఫీల్డ్ సెట్ చేశాడు. ఇది విచిత్రంగా అనిపించినా ఇదే జ‌రిగింది. ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. 

Rishabh Pant

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. డిసెంబర్ 2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ దాదాపు ఏడాది కాలం పైగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. 

ఆ ప్ర‌మాదం నుంచి కోలుకున్న త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు పంత్ తొలిసారిగా టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో టీమ్ ఇండియా తరపున ఆడుతున్నాడు. అంత‌కుముందు ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ 2024 తో క్రికెట్ గ్రౌండ్ లో బ్యాట్ ప‌ట్టాడు పంత్. అలాగే, భార‌త టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 జ‌ట్టులో కూడా భాగం అయ్యాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్ గా నిలిచింది. 

Latest Videos


ఆ తర్వాత శ్రీలంకతో వన్డేలో ఆడే అవకాశం పంత్‌కు దక్కింది. ఇప్పుడు అతను తన అభిమాన ఫార్మాట్‌కు తిరిగి వచ్చిన వెంటనే మ‌రో సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ సెంచ‌రీ సాధించాడు. ఎంఎస్ ధోని సెంచ‌రీల రికార్డును స‌మం చేశాడు. 

చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 52 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. పంత్ 128 బంతుల్లో 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. పంత్ తన కెరీర్‌లో ఆరో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. స్టేడియంలో అన్ని వైపుల చాలా షాట్లు కొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంత్ చేసిన ఒక‌ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rishabh Pant

గిల్, పంత్ దెబ్బ‌కు బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఈ స‌మ‌యంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్  బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు.  బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటోను లెగ్ సైడ్‌లో ఉంచమని పంత్ కోరిన వీడియో వైరల్ అవుతోంది. శాంటో వైపు చూపిస్తూ ఇక్క‌డ మిడ్ వికెట్ ఫీల్డ‌ర్ లేడు. ఇక్క‌డ ఒక‌రిని పెట్టండి అంటూ స‌ల‌హా ఇచ్చాడు.  బంగ్లాదేశ్ కెప్టెన్ నిజానికి ఆ సలహా తర్వాత మిడ్ వికెట్ వద్ద ఒక ఫీల్డర్‌ని ఉంచాడు. 

రిష‌బ్ పంత్ ఇలా బంగ్లా ఫీల్డింగ్ ను సెట్ చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. పంత్ ధోనీని ఇలా మ‌రోసారి గుర్తు చేశాడు కూడా.  2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ ఇలాంటిదే చేశాడు. ఫీల్డర్‌ను తొలగించమని సబ్బీర్ రెహ్మాన్ కు స‌ల‌హా ఇచ్చాడు. అప్పుడు కూడా అత‌ని స‌ల‌హాను ఆ టీమ్ పాటించ‌డం విశేషం.

ఇదిలా వుండ‌గా, రెండో ఇన్నింగ్స్ లో భార‌త్ స్టార్ బ్యాట‌ర్లు రిష‌బ్ పంత్, శుభ్ మ‌న్ గిల్ సూప‌ర్ బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ ముందు భార‌త్ 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పంత్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 287 పరుగులు చేసింది. 

ఇన్నింగ్స్ ను ఇక్క‌డి డిక్లేర్ చేయ‌డంతో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భార‌త్. శుభ్‌మన్ గిల్ 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లి 17 పరుగుల వద్ద, యశస్వి జైస్వాల్ 10 పరుగుల వద్ద, రోహిత్ శర్మ 5 పరుగుల వద్ద ఔటయ్యారు. కేఎల్ రాహుల్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 149 పరుగులు చేసింది.

పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ చేతిలో ఔటయ్యాడు. అత‌ని బౌలింగ్ లో  టెస్టు క్రికెట్‌లో నాలుగోసారి ఔటయ్యాడు. ఈ  ఫార్మాట్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత వికెట్‌కీపర్‌గా ధోని రికార్డును పంత్ సమం చేశాడు. వీరిద్ద‌రూ వికెట్ కీప‌ర్ గా ఇప్ప‌టివ‌ర‌కు ఆరు సెంచ‌రీలు చేశారు.

click me!