రోహిత్ గాయం గురించి తెలీదు... ఆస్ట్రేలియాకు ఎందుకు రాలేదో తెలీదు... బీసీసీఐపై విరాట్ కోహ్లీ అసహనం...

2020 సీజన్‌లో అత్యంత మిస్టరీగా మారుతున్న అంశం రోహిత్ శర్మ గాయం. ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన రోహిత్ శర్మ, రీఎంట్రీ ఇస్తూ గాయం తగ్గిపోయిందని చెప్పాడు. ఐపీఎల్‌లో మూడు మ్యాచులు ఆడిన తర్వాత కూడా రోహిత్ గాయం పూర్తిగా నయం కాలేదని చెప్పాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఓ వైపు రోహిత్, మరోవైపు బీసీసీఐ... ఒక్కోరూ ఒక్కోలా చెప్పడంతో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు క్రికెట్ అభిమానులు. తాజాగా తనకి కూడా రోహిత్ శర్మ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పాడు భారత సారథి విరాట్ కోహ్లీ.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో విబేధాల కారణంగానే ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మను దూరంగా పెట్టాలని వార్తలు వినిపించాయి. మొదట ఆసీస్ టూర్ మొత్తానికి రోహిత్‌ను పక్కనబెట్టిన బీసీసీఐ, ఆ తర్వాత అతనికి టెస్టుల్లో అవకాశం కల్పించింది.
తాజాగా సరైన సమయానికి ఆస్ట్రేలియా చేరుకోకపోవడంతో రోహిత్ శర్మను మొదటి రెండు టెస్టుల నుంచి తప్పిస్తున్నట్టు తెలిపింది బీసీసీఐ... డిసెంబర్ 8న ఇషాంత్ శర్మతో కలిసి రోహిత్ ఆస్ట్రేలియా చేరతాడని వార్తలు వినిపించాయి.

అయితే మొదటి వన్డే ప్రారంభానికి ముందే ఇషాంత్ శర్మను టెస్టు సిరీస్ నుంచి కూడా తప్పిస్తున్నట్టు తెలిపింది బీసీసీఐ. దీంతో రోహిత్ శర్మ విషయంలో సందిగ్ధత నెలకొంది.
మొదటి వన్డే ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ... ఈ విషయంలో తనకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బీసీసీఐ, రోహిత్ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు..
‘ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మకి రెండు వారాల విశ్రాంతి అవసరం అని భారత ఫిజియో తెలిపారు. రోహిత్ గాయం గురించి అతనికి పూర్తిగా వివరించాడు ఫిజియో...
జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని రోహిత్ శర్మకి సమాచారం అందించారు అధికారులు... అయితే ఇది జరిగిన రెండు మ్యాచుల తర్వాత రోహిత్ శర్మ మళ్లీ ఐపీఎల్ ఆడాడు...
ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు... ఐపీఎల్ ఆడుతున్నాడంటే అతను ఆస్ట్రేలియాకి వస్తాడని అనుకున్నాం... కానీ అలా జరగలేదు. రోహిత్ శర్మ ఎందుకు రావడం లేదో కూడా మాకు తెలీదు...
రోహిత్ శర్మ టెస్టు సిరీస్ ఆడతాడా? లేదా? అనే విషయం గురించి కూడా జట్టుకి ఎలాంటి సమాచారం లేదు. అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నాం.ఇప్పటికీ రోహిత్ శర్మ గాయం ఓ మిస్టరీగా ఉంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...
బీసీసీఐ నియమాల ప్రకారం ఏ క్రికెటర్‌కి గాయమైనా అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుని, క్లీన్ చిట్ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను ఎవ్వరూ సరిగా పాటించడం లేదు...
ఐపీఎల్‌లో గాయపడిన వృద్ధిమాన్ సాహా... యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. మరి రోహిత్ శర్మ విషయంలో ఇలా ఎందుకు చేయలేదనేది అతని అభిమానుల ప్రశ్న...
రోహిత్ శర్మ తండ్రికి కరోనా సోకిందని, అందుకే అతను స్వదేశానికి వచ్చాడని ప్రచారం జరిగింది. అయితే ఇదే నిజమైన విరాట్ కోహ్లీకీ ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేదు? నిజంగా రోహిత్ శర్మ అందుకే స్వదేశానికి వచ్చాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇషాంత్ శర్మను టెస్టు నుంచి తొలగించినట్టు ప్రకటించిన బీసీసీఐ అధికారులు, రోహిత్ శర్మ గాయాన్ని డిసెంబర్ 11న మరోసారి పరీక్షించబోతున్నారు. రోహిత్ తన ఫిట్‌నెస్ నిరూపించుకుంటే ఆస్ట్రేలియాకి పయనమై చివరి రెండు టెస్టులు ఆడతాడు.
వీలైతే 14 రోజుల క్వారంటైన్ నిబంధనను రోహిత్ శర్మ కోసం 6 రోజులకు కుదించాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరబోతోంది టీమిండియా. అయితే రోహిత్ శర్మ గాయంపై క్లారిటీ వస్తేనే ఇదంతా జరుగుతుంది.

Latest Videos

click me!