rahul dravid ishan kishan
Team India - Ishan Kishan:యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ను భారత జట్టు నుంచి తప్పించడంపై అనేక ఊహాగనాలు, సంచలన వార్తలు హల్ చల్ చేస్తున్న తరుణంలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ముందు విశ్రాంతి కోరుతూ జట్టును వీడిన కిషన్ ఆ తర్వాత దుబాయ్ లో తన సోదరుడి బర్త్ డే పార్టీకి హాజరై ఓ టీవీ గేమ్ షోలో పాల్గొన్నాడనీ, ఇది సెలక్టర్లకు ఆగ్రహం తెప్పించిందని వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే టీమ్ నుంచి తప్పించారని పెద్ద ఎత్తున వార్తలు రావడంపై బీసీసీఐ వర్గాలు కూడా పెద్దగా స్పందించలేదు. దీంతో హాట్ టాపిక్ అయింది.
Ishan Kishan
దక్షిణాఫ్రికాతో టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ టెస్టు సిరీస్ కు ముందు తప్పుకోవడంతో సెలెక్టర్లు కేఎస్ భరత్ ను రెండో వికెట్ కీపర్ గా దక్షిణాఫ్రికాకు పంపారు. వీటన్నింటిపై అసంతృప్తిగా ఉన్నారా? అందుకే అఫ్గానిస్థాన్ సిరీస్ కు ఇషాన్ కిషన్ ను జట్టు నుంచి తప్పించారా అని ద్రవిడ్ను ప్రశ్నించగా.. వార్తలను తోసిపుచ్చిన ద్రవిడ్ విశ్రాంతి తీసుకోవడానికి ఇషాన్ కిషన్ జట్టును వీడినట్లు తెలిపాడు. తాను రీ సెలక్షన్ కు సిద్ధంగా ఉన్నానని ఇషాన్ కిషన్ ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడి తన ఫామ్, ఫిట్నెస్ ను నిరూపించుకోవడం ద్వారా కిషన్ తిరిగి జట్టులోకి రావచ్చని ద్రవిడ్ అన్నాడు.
గత జూన్ లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ కోసం భారత జట్టులో సభ్యుడైన ఇషాన్ కిషన్, ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్ ల తర్వాత సూపర్ ఫోర్ రౌండ్ లో కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడంతో ప్లేయింగ్ ఎలెవన్ లో స్థానం కోల్పోయాడు. డెంగ్యూ జ్వరం కారణంగా శుభ్ మన్ గిల్ తొలి రెండు మ్యాచ్ లలో ఆడలేకపోవడంతోనే ఇషాన్ కిషన్ కు ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం లభించింది.
ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో మూడు మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్ చివరి రెండు టీ20లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం దక్కలేదు. వరుస తప్పిదాలతో విసిగిపోయిన కిషన్ విశ్రాంతి కోరుతూ జట్టును వీడినట్లు సంకేతాలు వచ్చాయి.