తమీమ్‌కు గాయం.. ఇండియాతో సిరీస్‌కు కొత్త కెప్టెన్ ను ప్రకటించిన బంగ్లాదేశ్..

First Published Dec 2, 2022, 6:53 PM IST

INDvsBAN: మరో రెండ్రోజుల్లో భారత్ తో కీలక వన్డే సిరీస్ ఆడనున్న బంగ్లాదేశ్ కు  రెగ్యులర్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తో పాటు స్టార్ పేసర్ టస్కిన్ అహ్మద్ కు గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. 

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈనెల 4 నుంచి మొదలుకాబోయే ఈ సిరీస్ కు ముందు బంగ్లాదేశ్ కు  డబుల్ షాక్ లు తాకిన విషయం తెలిసిందే.  

బంగ్లా స్టార్ పేసర్  టస్కిన్ అహ్మద్  వెన్ను నొప్పి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో  షోరిఫుల్ ఇస్లాం  జట్టుతో చేరాడు.  వెన్నునొప్పి తగ్గకుంటే  టస్కిన్ తర్వాత రెండు వన్డేలు కూడా ఆడేది అనుమానమే. టస్కిన్ గాయంతోనే సతమతమవుతున్న బంగ్లాదేశ్ కు ఇవాళ మరో షాక్ తాకింది. ఆ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా  గాయంతో బాధపడుతున్నాడు. తమీమ్ కు గజ్జల్లో గాయం కావడంతో అతడు ఏకంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు.
 

భారత్ తో వన్డే సిరీస్ కు ముందు నవంబర్ 30న ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో  జరిగిన వార్మప్ మ్యాచ్ లో   తమీమ్ కు గాయమైంది.   అతడి గాయాన్ని పరిశీలించిన వైద్యులు తమీమ్ కు రెండు వారాల విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు. దీంతో  తమీమ్ భారత్ తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వన్డే సిరీస్ తో పాటు అతడు  తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది.   

గాయపడ్డ  బంగ్లా సారథి  తమీమ్ స్థానంలో బంగ్లాదేశ్.. ఇండియాతో సిరీస్ కు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. ఆ జట్టుకు టెస్టులలో వైస్ కెప్టెన్ గా ఉన్న లిటన్ కుమార్ దాస్.. ఇండియాతో మూడు వన్డేలకు బంగ్లాను నడిపించనున్నాడు. ఈ మేరకు  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

లిటన్ దాస్.. ఇటీవలే టీ20 ప్రపంచకప్ లో భాగంగా  భారత్ తో ఆడిన మ్యాచ్ లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని  బంగ్లాదేశ్   ఛేదించేలా కనబడింది.  లిటన్ దాస్.. 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. అయితే ఏడు ఓవర్ల తర్వాత వాన కురవడం.. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లా తడబడటంతో   మ్యాచ్ ను భారత్ గెలుచుకుంది. 

కాగా  లిటన్ దాస్.. బంగ్లా జట్టుకు వన్డేలలో 15వ సారథి కానున్నాడు. టెస్టులలో వైస్ కెప్టెన్ గా ఉన్న దాస్..  2021లో స్వదేశంలో న్యూజిలాండ్ తో  టీ20 సిరీస్ లోమహ్మదుల్లా గాయపడటంతో తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. ఇప్పుడు ఏకంగా ఇండియాతో వన్డే సిరీస్ కు  అతడు కెప్టెన్ గా ఉండనున్నాడు.  

బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వన్డేలు డిసెంబర్ 4, 7, 10 తేదీలలో జరుగనుండగా  డిసెంబర్ 14-18 మధ్య  తొలి టెస్టు,  22-26 మధ్య  రెండో టెస్టు  జరగాల్సి ఉంది.  ఈ మేరకు భారత జట్టు ఇదివరకే ఢాకా చేరుకుంది. 

click me!