భారత్‌లో టెస్టు క్రికెట్‌ చచ్చిపోతోంది.. ఐపీఎల్ వల్లే ఇదంతా : ఇంగ్లాండ్ మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు

First Published Feb 3, 2023, 3:32 PM IST

‘ఇండియాలో టెస్టు క్రికెట్ చూడటానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.  ఇదంతా ఐపీఎల్ వల్లే.  ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నది. దాంతో ఇక్కడ టెస్టు క్రికెట్ గురించి పట్టించుకునే నాధుడే లేడ’ని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ సారథి ఇయాన్ బోథమ్.. 

ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలను అధికారికంగా గణించినా  ఓ ఇరవైకి మించవు. అందులో అసోసియేట్ దేశాలు  పోను  శాశ్వత సభ్య దేశాలు 12కి మించవు.  ఇందులో  అన్ని దేశాలూ అన్ని ఫార్మాట్లు ఆడతాయా..? అంటే అదీలేదు. కొన్ని దేశాలు వన్డే,  టీ20లకే పరిమితమయ్యాయి. మరికొన్నింటికి టెస్టు హోదా ఉన్నప్పటికీ అవి  ఎప్పుడో గానీ  రెడ్ బాల్ క్రికెట్ ఆడవు.

టెస్టు క్రికెట్ ఆడే దేశాల్లో  కూడా  ప్రముఖంగా వినిపించేవి ఐదారు  దేశాలే.  అందులో భారత్ ప్రముఖంగా ఉంటుందనడంలో సందేహమే లేదు. టెస్టు క్రికెట్ లో అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్  తర్వాత ఆడుతున్న టెస్టు మ్యాచ్ సంఖ్యాపరంగా చూసినా లేక విజయాల పరంగా చూసినా టీమిండియా కచ్చితంగా  అగ్రభాగంలో ఉంటుంది.

గణాంకాలు కళ్లముందు 70 ఎంఎం తెర మీద కనిపించినట్టు  కనిపిస్తున్నా పలువురు  విదేశీ  క్రికెటర్లకు మాత్రం భారత క్రికెట్ మీద అసూయ అలాగే ఉంటుంది.  తాజాగా ఇంగ్లాండ్ మాజీ సారథి ఇయాన్ బోథమ్ మాట్లాడుతూ.. భారత్ లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని అంటున్నాడు. ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు బోథమ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

ది స్పోర్ట్స్ మిర్రర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోథమ్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో టెస్టు క్రికెట్ చూడటానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.  ఇదంతా ఐపీఎల్ వల్లే.  ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నది. ఈ లీగ్ మోజులో  పడ్డ జనాలు  సంప్రదాయ టెస్టు క్రికెట్ ను చూడటం మానేశారు.  ఇది ఎక్కడిదాకా వెళ్తుందో ఆందోళనగా ఉంది. 

అయితే టెస్టు క్రికెట్ మొదలై వందేండ్లు గడిచింది.  టెస్టు క్రికెట్  ఎక్కడికీ వెళ్లదు.  వన్డేలు, టీ20లు, టీ10లు అంటూ ఎన్ని కొత్త ఫార్మాట్ లు వచ్చినా   టెస్టు క్రికెట్  కు ఢోకా లేదు. ఒకవేళ టెస్టు క్రికెట్ చచ్చిపోయే స్థితికి వస్తే మనం క్రికెట్ నే కోల్పోవాల్సి ఉంటుంది.  ఇదంతా అర్థరహితంగా అనిపిస్తున్నా ఇదే నిజం. ప్రతి క్రికెటర్  తన కెరీర్ లో ఒక్క టెస్టు మ్యాచ్ అయినా ఆడాలి.  అలా ఆడితేనే అది పరిపూర్ణమైన కెరీర్ అవుతుంది..’అని బోథమ్ చెప్పాడు. 

కాగా  భారత క్రికెటర్లు ఎక్కడికి వెళ్లినా  అభిమానులు బ్రహ్మరథం పడతారు.  స్వదేశంలో చిన్న దేశాలతో టెస్టులు ఆడినా చూడటానికి వేలాదిగా అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు.  ఇక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి దేశాలతో ఆడితే మాత్రం స్టేడియాలు నిండాల్సిందే. వన్డేలు, టీ20ల గురించి చెప్పాల్సిన పన్లేదు. 

click me!