వైస్ కెప్టెన్ అయినా సరే.. బాగా ఆడితేనే ఉంటాడు లేదంటే వేటు తప్పదు.. కెఎల్ రాహుల్ కు వార్నింగ్

First Published Feb 3, 2023, 1:55 PM IST

Border Gavaskar Trophy: స్వదేశంలో భారత్ - ఆస్ట్రేలియాల మధ్య   ఫిబ్రవరి 9 నుంచి  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్నది. ఈ సిరీస్ లో రెండు మూడు ఇన్నింగ్స్ లలో గనక విఫలమైతే  కొత్త పెళ్లి కొడుకు  కెఎల్ రాహుల్ కు తిప్పలు తప్పవని అంటున్నాడు మాజీ ఆటగాడు కైఫ్. 

ఈ ఏడాది  స్వదేశంలో భారత్ పరిమిత ఓవర్ల  క్రికెట్ లో జోరు చూపిస్తున్నది.  శ్రీలంక, న్యూజిలాండ్ తో  వన్డేలు, టీ20 సిరీస్ లను కైవసం చేసుకుంది.  కివీస్ తో టీ20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత్.. ఇక రెడ్ బాల్ మీద దృష్టి పెట్టింది. ఈ నెల 9 నుంచి కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో భారత్.. నాలుగు టెస్టులు ఆడనుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఈ సిరీస్ జరుగనుంది. 

ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే నాగ్‌పూర్ కు చేరుకుంది.  కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లతో పాటు వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్  కూడా  నాగ్‌పూర్  కు చేరాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న రాహుల్..  రిసెప్షన్, హనీమూన్ లను పక్కనబెట్టి మరీ  టీమ్ తో కలిశాడు. 

అయితే ఈ సిరీస్ లో రాణించడం కెఎల్ రాహుల్ కు చాలా కీలకమని అంటున్నాడు టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్. రాహుల్ రాణించకుంటే   అతడిని వైస్ కెప్టెన్ అని కూడా చూడరని,   నయా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ లు  రెచ్చిపోతున్న వేళ రాబోయే రోజుల్లో రాహుల్ కు కష్టాలు తప్పవని కైఫ్ అంటున్నాడు.  

కైఫ్ మాట్లాడుతూ... ‘ఈ సిరీస్ (ఆస్ట్రేలియా) రాహుల్ కు చాలా కీలకం.  అతడు తప్పకుండా పరుగులు చేయాలి. రెండు మూడు ఇన్నింగ్స్ లలో గనక రాహుల్ విఫలమైతే అతడికి తిప్పలు తప్పవు.  వైస్ కెప్టెన్ అని కూడా చూడకుండా టీమ్ నుంచి తొలగిస్తారు.  శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్ లో  ఉన్న నేపథ్యంలో   రాహుల్  ను జట్టు నుంచి తప్పించడానికి  టీమ్ మేనేజ్మెంట్ కూడా వెనుకాడకపోవచ్చు. 

తొలి టెస్టులో  శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగానే ఉంది.  అయితే రెండో టెస్టుకల్లా అతడు సెట్ అవొచ్చు.  తొలి టెస్టులో గనక రాణించకుంటే  రాహుల్  కు రెండో టెస్టులో ఛాన్స్ ఇవ్వాలా..? వద్దా..? అన్న  ఆలోచన కూడా మొదలవుతుంది.  అయ్యర్ వస్తే సూర్య, గిల్ లలో ఎవరికో ఒకరికే చోటు దక్కుతుంది. ఒకవేళ ఈ ఇద్దరినీ ఆడించాలంటే  రాహుల్  పై వేటు తప్పదు. అయితే ఇదంతా రాహుల్ ఎలా ఆడతాడనేదానిబట్టి ఉంటుంది.. 

ఒకవేళ  గిల్ ను ఆడిస్తే ఓపెనర్ గా కంటే  అతడిని ఐదు లేదా ఆరో స్థానంలో ఆడించొచ్చు. ఓపెనర్లుగా రోహిత్ - రాహుల్ వస్తే మూడో స్థానంలో పుజారా వస్తాడు.  నాలుగో స్థానంలో కోహ్లీ ఉండనే ఉన్నాడు.  ఆ తర్వాత  శ్రేయాస్ రావాలి. ఒకవేళ అతడు లేకుంటే  ఆ స్థానంలో  గిల్ ను  ఆడించాలి.  ఐదు లేకుంటే  ఆరో స్థానంలో  అతడిని ఆడిస్తే భారత బ్యాటింగ్ లోతు పెరుగుతుంది..’అని చెప్పాడు. 
 

click me!