అలా జరిగినప్పుడు పెన్నులూ గన్నులే కాదు.. మామీద యాసిడ్ కూడా పడొచ్చు : రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్

First Published Nov 12, 2021, 6:23 PM IST

Ravi Shastri: ‘భారత్ లో క్రికెట్ ఒక మతం వంటిది. మీరు 5  మ్యాచ్ లు గెలిచి ఒక్కటి ఓడిపోయినా జనాలు ఆ ఒక్కదాన్నే పట్టించుకుంటారు. ఓడినప్పుడు పెన్నులు, గన్నులు బయటకు వస్తాయ’ని రవిశాస్త్రి సంచలన కామెంట్స్ చేశాడు.


టీమిండియా మాజీ  హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇటీవలే తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నాడు. అతి త్వరలో అతడు ఐపీఎల్ లో ఓ జట్టుకు కోచ్ గా సేవలందించనున్నట్టు సమాచారం. అయితే ఐదేండ్ల పాటు భారత క్రికెట్ జట్టుకు ప్రధాన శిక్షకుడిగా సేవలందించిన రవిశాస్త్రి.. ఆ కాలంలో తాను ఎదుర్కొన్న పలు విమర్శలపై ఘాటుగా స్పందించాడు. 

భారత్ లో క్రికెట్ ను ఓ మతంలా భావిస్తారని, ఈ గేమ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్నాడు. జట్టుగా  తాము గెలిచినప్పుడు కంటే ఓడిపోయినప్పుడే విమర్శల దాడి ఎక్కువుంటుందని, కొన్ని సార్లు వాటిని తట్టుకోవడం కష్టమనిపించినా అవి తప్పవని చెప్పాడు.

రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘భారత్ లో క్రికెట్ ఒక మతం. మీరు 5  మ్యాచ్ లు గెలిచి ఒక్కటి ఓడిపోయినా జనాలు ఆ ఒక్కదాన్నే పట్టించుకుంటారు. మీరు ఓడిపోయినప్పుడు పెన్నులు, గన్నులు (విమర్శకులను ఉద్దేశిస్తూ..) బయటకు వస్తాయి.

కొన్ని కొన్ని సార్లు  ఆ స్థానంలో యాసిడ్ కూడా ఉంటుంది. మీరు అన్నింటినీ ఒకే రకంగా స్వీకరించాలి. మేం (టీమిండియా) చాలా గెలిచాం. కానీ ఓడిపోవడాన్ని మాత్రం ప్రజలు అలవాటు చేసుకోలేదు. మీరు అన్ని అడ్డంకులను అధిగమించాలి.

అప్పుడే మీరు ఒత్తిడిని తట్టుకుని బలంగా నిలబడతారు. జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని మీరు నమ్మాలి. మధ్యలో ఈ విమర్శకులను పట్టించుకోకుండా ముందుకు సాగాలి. అప్పుడే విజయం సాధిస్తాం..’ అంటూ రవిశాస్త్రి తెలిపాడు.  

అంతేగాక... తాను టీమిండియా కోచ్ గా ఉన్నన్ని రోజులు తాము చేసే ప్రతి పనిని విమర్శకులు ఎత్తి చూపారని, ఇప్పుడు ఆ వంతు తనదని అన్నాడు. ఏడేండ్ల పాటు విమర్శలు ఎదుర్కున్న తాను.. ఇక నుంచి తనను విమర్శించిన వారిని చూస్తూ.. అందులో కొందరికి తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైందని అన్నాడు. 

2017లో భారత జట్టుకు ప్రధాన కోచ్ గా నియమితుడైన రవిశాస్త్రి..  ఆ తర్వాత ఐదేండ్ల పాటు టీమిండియాకు కోచ్ గా ఉన్నాడు. టీ20  ప్రపంచకప్ తో అతడి కాంట్రాక్ట్ ముగిసింది. రవిశాస్త్రి  స్థానాన్ని రాహుల్ ద్రావిడ్ భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. 

కాగా..  2016లో తనకు, క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడైన సౌరవ్ గంగూలీకి మధ్య మనస్పర్ధల వచ్చిన మాట వాస్తమమేనని రవిశాస్త్రి సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవికి జరిగిన ఇంటర్వ్యూలో గంగూలీ, లక్ష్మణ్, సచిన్ సభ్యులుగా ఉన్నారని, ఆ సమయంలో తాను రాసుకొచ్చుకున్న ఒక లెటర్ మిస్ అయిందని రవిశాస్త్రి తెలిపాడు.

అయితే ఆ విషయం వారి ముందు చెప్పడం తనకు చిన్నతనంగా అనిపించిందని, ఆ విషయం వారికి చెబితే అది గంగూలీకి నచ్చలేదని చెప్పాడు. ఇది చాలా చిన్న విషయమే అయినా మీడియా దీనిని పెద్దది చేసి చూపిందని రవిశాస్త్రి వాపోయాడు. 

click me!