కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఏం చేయలేడు, టీమ్ సెలక్షన్ అంతా వాళ్ల చేతుల్లోనే... మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు...

First Published Nov 12, 2021, 3:50 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫామ్‌లో లేని హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేయడం, అద్బుతమైన ఫామ్‌లో ఉన్న యజ్వేంద్ర చాహాల్‌ను పక్కనబెట్టడం ట్రోలింగ్‌కి కారణమైంది...

శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ వంటి సీనియర్లను పక్కనబెట్టి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంపై కూడా అభిమానులు, నేరుగానే విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలను తీవ్రంగా విమర్శించారు...

అయితే హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి, ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ‘చాలామంది టీమ్ సెలక్షన్ అంతా కెప్టెన్, హెడ్ కోచ్ చేతుల్లోనే ఉంటుందని అనుకుంటారు. నిజానికి మాకు టీం సెలక్షన్ విషయంలో ఎలాంటి హక్కూ ఉండదు...

ఏ టూర్‌కి అయినా, సిరీస్‌కి అయినా సెలక్టర్లే మొత్తం 15 మంది ప్లేయర్లను ఎంపిక చేస్తారు. ఆ లిస్టులో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలనే అధికారం కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండదు... 

కేవలం సదరు ప్లేయర్‌ని ఎందుకు సెలక్ట్ చేశారు? అని సెలక్టర్లను అడిగి తెలుసుకోవడానికి మాత్రం విరాట్ కోహ్లీకి అధికారం ఉంటుంది. సెలక్టర్లు ఇచ్చిన టీమ్‌తో అద్భుతాలే చేశాడు విరాట్ కోహ్లీ...

నా దృష్టిలో భారత టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన అద్భుతాలు ఇంతకుముందు ఏ కెప్టెన్ కూడా చేయలేకపోయాడు. టీమిండియా కోచ్, కెప్టెన్ కోహ్లీ శాస్త్రి టీమ్‌లా తయారయ్యిందని ట్రోల్స్ వచ్చాయి. అవి నేనూ విన్నాను...

అయితే జట్టులో ఏం జరుగుతుందో డ్రెస్సింగ్ రూమ్‌ వరకే పరిమితం. కొత్త క్రికెటర్‌ కూడా ధైర్యంగా కెప్టెన్‌కి సలహాలు ఇచ్చేలా మార్పులు తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి...

అయితే రవిశాస్త్రి కామెంట్లు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ‘ఎమ్మెస్ ధోనీ’లో మాహీ పేరుని సెలక్టర్లకు గంగూలీ సూచించినట్టుగా చూపించారు...

అలాగే మాహీ మెంటర్‌గా నియమితుడైన తర్వాత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉన్న హార్ధిక్ పాండ్యాను, తొలగించకుండా అడ్డుకున్నాడని కూడా మాజీ ఛీఫ్ సెలక్టర్లు కామెంట్ చేశారు...

దీంతో విరాట్ కోహ్లీకి మాత్రం జట్టు ఎంపిక విషయంలో స్వేచ్ఛ లేకుండా ఎందుకు చేశారు. గంగూలీ, ధోనీ టైంలో వాళ్లకి నచ్చిన ప్లేయర్లను ఆడించే ఫ్రీడమ్, కెప్టెన్లకి ఇచ్చినప్పుడు కోహ్లీ విషయంలో మాత్రం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించారు...

2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అప్పటి భారత హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, విరాట్ మధ్య జరిగిన గొడవలు, అర్ధాంతరంగా కుంబ్లే, కోచ్ పదవి నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలే కోహ్లీకి జట్టు ఎంపిక విషయంలో ఎలాంటి ప్రమేయం లేకుండా చేసి ఉంటాయని అనుమానిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

అలాగే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో కీలకమైన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ మారుస్తూ చేసిన ప్రయోగాలు కూడా భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవడానికి కారణమయ్యాయి...

ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ రావడంతో, రోహిత్ వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ టూ డౌన్‌లో రావడంతో భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమై 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే...

ఈ మ్యాచ్ విషయంలో జరిగిన ప్రయోగాలు కూడా విరాట్ ప్రమేయం లేకుండానే జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

click me!