ఆసియా కప్ 2023 టోర్నీని పాక్‌ నుంచి తరలిస్తే, అది కూడా ఆడం... పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

First Published Dec 3, 2022, 11:44 AM IST

పీసీబీ అధ్యక్షుడిగా రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఆటతీరు కాస్త మెరుగుపడింది. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో మొదటిసారి భారత్‌పై విజయం సాధించిన పాక్... ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఫైనల్ చేరింది... అందుకేనేమో రమీజ్ రాజా మేకపోతు గాంభీర్యాన్ని అలవర్చుకున్నాడు...

షెడ్యూల్ ప్రకారం వన్డే ఫార్మాట్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో అడుగుపెట్టని టీమిండియా, ఆసియా కప్ కోసం శత్రుదేశంలో అడుగుపెట్టేది లేదని తేల్చేసింది బీసీసీఐ...

India vs Pakistan

భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ, పాక్‌లో పర్యటించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని... వాళ్లు క్లియరెన్స్ ఇస్తే వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. అయితే బీసీసీఐ రియల్ బాస్ లాంటి సెక్రటరీ జై షా...పాక్‌లో అడుగుపెట్టేది లే... అంటూ కుండబద్ధలు కొట్టాడు...

India vs Pakistan

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టు, పాకిస్తాన్‌లో అడుగుపెట్టడం జరగదు.తటస్థ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహిస్తాం..’ అంటూ వ్యాఖ్యానించాడు జై షా. బీసీసీఐ సెక్రటరీ హోదాలో ఉన్న జై షా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు కావడంతో కేంద్రం నిర్ణయం కూడా ఇదేనని తేలిపోయింది...

అంతేకాకుండా ఆసియా క్రికెట్ కమిటీ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జై షా, తటస్థ వేదికలో ఆసియా కప్ 2023 నిర్వహిస్తామని చెప్పడంతో పాక్‌లో ఈ టోర్నీ జరగడం అనుమానంగా మారింది. అయితే రమీజ్ రాజా మాత్రం పాక్‌లోనే ఆసియా కప్ నిర్వహించి తీరతామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు...

‘మేం న్యాయబద్ధంగా సక్రమమైన రీతిలో ఆసియా కప్ 2023 నిర్వహణకు ఆతిథ్య హక్కులు తీసుకున్నాం. ఇండియా ఇక్కడికి రాకపోతే, రాకపోనివ్వండి. మేం ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడం. ఒకవేళ పాకిస్తాన్‌లో ఆసియా కప్ నిర్వహించకపోతే, మరే దేశంలో ఈ టోర్నీ జరిగినా అందులో మేం ఆడం.. 

పాకిస్తాన్‌లో పరిస్థితులు మారిపోయాయని నిరూపించుకున్నాం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఇక్కడ పర్యటించి వెళ్లాం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు పెట్టుకోవడానికి రాజకీయ విషయాలు అడ్డుగా ఉన్నాయని తెలుసు. ఆసియా కప్ టోర్నీలో ఆడడానికి మీకొచ్చిన ఇబ్బంది ఏంటి... మా వరకూ ఆసియా కప్ కూడా వరల్డ్ కప్‌ అంత పెద్దదే...’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా..

click me!