ఫ్రాంచైజీలు ఇబ్బందిపడతాయా..? పడనియి.. దేశానికంటే ఐపీఎల్ ఎక్కువ కాదు.. సీనియర్లకు బీజేపీ ఎంపీ సూచనలు

First Published Jan 9, 2023, 12:32 PM IST

బీసీసీఐ ఇటీవలే వన్డే వరల్డ్ కప్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  20 మంది ప్లేయర్లను ఎంపిక చేసి వన్డే ప్రపంచకప్ వరకూ వారినే ఆడించడం.. ఫిట్నెస్ కాపాడుకుంటూ గాయాల బారిన పడకుండా చూసుకోవడం వంటి అంశాలతో భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 

గత కొన్నేండ్లుగా  ఐసీసీ టోర్నీలలో విఫలమవుతున్న టీమిండియా ఈ ఏడాది స్వదేశంలో జరుగబోయే వన్డే ప్రపంచకప్ ను మాత్రం ఎలాగైనా ఒడిసిపట్టాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో  రేపటి (జనవరి 10) నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ కూడా మొదలుకానుంది.  వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని  జట్టు ఎంపిక, వ్యూహాలు ఉండనున్నాయి. 

అయితే అక్టోబర్ లో జరుగనున్న ఈ మెగా  టోర్నీ కంటే ముందే  భారత్ లో మార్చి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2023 సీజన్ కూడా జరగాల్సి ఉంది.  రెండు నెలల పాటు సాగే ఈ సీజన్ లో  టీమిండియా స్టార్ ఆటగాళ్లు దాదాపు అందరూ  పాల్గొననున్నారు. సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ ఆటగాళ్లు  బుమ్రా, షమీ, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్  కూడా తమ ఫ్రాంచైజీల తరఫున ఆడనున్నారు. 

వన్డే వరల్డ్ కప్ ముందున్న తరుణంలో   స్టార్ ప్లేయర్లు, బీసీసీఐ  షార్ట్ లిస్ట్ చేసిన 20 మంది ఆటగాళ్లు   ఐపీఎల్ కు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నాడు టీమిండియా మాజీ  ఓపెనర్, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్న  గౌతం గంభీర్. శ్రీలంకతో వన్డే సిరీస్  ప్రారంభానికి ముందు  గంభీర్.. ఓ టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు.

గంభీర్ మాట్లాడుతూ.. ‘టీమిండియా సీనియర్ ఆటగాళ్లు, బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరంగా ఉంటేనే మంచిది. ఫిట్నెస్, రెస్ట్  కూడా వాళ్లకు చాలా అవసరం.  ప్రధానంగా వారి దృష్టి దేశానికి ఆడటం మీద ఉండాలి.   ఐపీఎల్ ప్రతీ ఏడాదికి ఒకసారి వస్తుంది. కానీ  వరల్డ్ కప్ అలా కాదు. నాలుగేండ్లకోసారి జరుగుతుంది. 
 

ఐపీఎల్ లో ఆడకుంటే ఫ్రాంచైజీలు ఇబ్బంది పడతాయా..?  పడనియండి. ఏం పర్లేదు. ఎందుకంటే ఒక క్రికెటర్ కు  ఫ్రాంచైజీ తరఫున ఆడటం కంటే దేశానికి ఆడటమే అన్నింటికంటే ప్రాధాన్యం కావాలి. ఐపీఎల్ అనేది బై ప్రొడక్ట్ వంటిది మాత్రమే.

మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు  ఒకవేళ రెస్ట్ తీసుకోవాలనుకుంటే వాళ్లకు టీ20 ల నుంచి  విశ్రాంతినివ్వాలి. కానీ వన్డేలలో మాత్రం తప్పనిసరిగా ఆడించాలి.  ఒక టీ20 సిరీస్ ఆడకపోతే కొంపలేమీ మునిగిపోవు..’ అని  వ్యాఖ్యానించాడు.  

కాగా బీసీసీఐ ఇటీవలే వన్డే వరల్డ్ కప్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  20 మంది ప్లేయర్లను ఎంపిక చేసి వన్డే ప్రపంచకప్ వరకూ వారినే ఆడించడం.. ఫిట్నెస్ కాపాడుకుంటూ గాయాల బారిన పడకుండా చూసుకోవడం వంటి అంశాలతో భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.  ఇందులో భాగంగానే  మంగళవారం నుంచి శ్రీలంకతో  వన్డే సిరీస్  మొదలుపెట్టనుంది. 

click me!