IND vs PAK: అవసరం లేదు.. ఆదివారం భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ల ఆగ్రహం

First Published | Oct 20, 2022, 4:05 PM IST

India vs Pakistan: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ లో మంటలు పుట్టిస్తున్నాయి.  వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడేందుకు  తాము  ఆ దేశానికి వెళ్లమంటూ ఆయన వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. 

టీ20 ప్రపంచకప్‌లో ఈనెల 23న  మెల్‌బోర్న్ వేదికగా జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే  ఈ మ్యాచ్ కు వరుణుడి గండం ఉందన్న దానికంటే గత మూడు రోజులుగా ఇరు జట్ల బోర్డులు, మాజీ క్రికెటర్లు చేసుకుంటున్న వ్యాఖ్యలతో అసలు ఆదివారం మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనే అనుమానం తలెత్తుతున్నది. 

వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉండగా టీమిండియా మాత్రం పాక్ కు వెళ్లదని.. ఈ టోర్నీని తటస్థ వేదిక మీద అయితే ఆడతామని  జై షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ఘాటుగానే స్పందించింది.  జై షా ప్రకటన నిరాశపరిచిందని, ఏకపక్షంగా ఉందని అంటూనే ఆయన వ్యాఖ్యలు భవిష్యత్  పర్యటనలపై ప్రభావం చూపుతాయని  ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. 


అయితే పీసీబీ స్పందనను పక్కనబెడితే  పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం జై షా  వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ కు భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో  వచ్చే ప్రపంచకప్ దాకా ఆగాల్సిన పన్లేదని.. ఈనెల 23న భారత్ తో జరిగే మ్యాచ్ ను బాయ్‌కాట్ చేయాలని సూచిస్తున్నారు. 

ఇదే విషయమై పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఏఆర్‌వై న్యూస్‌తో స్పందిస్తూ.. ‘జై షా అలా వ్యాఖ్యానిస్తాడని నేను ఊహించలేదు. ఈ ఏడాది  దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్ లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఆయన వచ్చాడు. కానీ ఆయన రాజకీయాలకు మాత్రమే పరిమితమైనట్టు కనిపిస్తున్నది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పన్లేదు. 

ఆసియా కప్ -2023 పాకిస్తాన్ లోనే జరగాలి. ఒకవేళ అలా జరుగకుంటే.. ఇకపై ఇండియాతో పాకిస్తాన్  ఏ స్థాయిలోనూ  ఆడదు. అది ఐసీసీ ఈవెంట్ కావొచ్చు.. ఏసీసీ కావొచ్చు.. ఏదైనా సరే. ఈ విషయంలో భారత్ నిర్ణయం స్పష్టంగా ఉంటే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వరకూ ఆగాల్సిన పన్లేదు. ఈ నెల 23న భారత్-పాక్ మ్యాచ్ ను బాయ్‌కాట్ చేయండి..’ అని తెలిపాడు. 
 

మరో మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ కు రావొద్దన్న ఇండియా నిర్ణయం గనక ఫైనల్ అయితే  పాక్ వచ్చే ఏడాది  వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లదు.  తటస్థ వేదికపై 2023 ఆసియా కప్ కు కూడా అంగీకరించే ప్రసక్తే లేదు. ఆసియా కప్  పాకిస్తాన్ లోనే జరగాలి..’ అని కామెంట్ చేశాడు. 

వీళ్లిద్దరే గాక జై షా వ్యాఖ్యలపై షాహిద్ అఫ్రిది కూడా స్పందించిన విషయం తెలిసిందే. ‘గతేడాది కాలంగా  రెండు దేశాల ఆటగాళ్ల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ కు ముందు బీసీసీఐ సెక్రటరీ ఇలా ఎందుకు వ్యాఖ్యానించాడో తెలియదు. భారత్ లో క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్ అనుభవరాహిత్యాన్నిఈ ప్రకటన ప్రతిబింబిస్తుంది’ అని  ట్వీట్ చేశాడు.  

Latest Videos

click me!