ఇంగ్లిస్ పోయి గ్రీన్ వచ్చె.. టీమిండియాపై దుమ్ము దులిపిన ఆటగాడిని జట్టులోకి చేర్చుకున్న ఆసీస్

First Published | Oct 20, 2022, 3:18 PM IST

T20 World Cup 2022: ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. శనివారం తమ తొలి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఆడనుంది. ఈ  మ్యాచ్ కంటే ముందే ఆ జట్టులో మార్పులు జరిగాయి. 

టీ20 ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా.. తమ జట్టులో మార్పులు చేసింది.  బుధవారం న్యూసౌత్ వేల్స్ లోని ఓ క్లబ్ లో గోల్ఫ్ ఆడుతూ గాయమైన ఆసీస్ రిజర్వ్ వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకొచ్చింది. 

కొద్దిరోజుల క్రితం భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ తుది జట్టులో ఉన్న  విధ్వంసకర ఆల్ రౌండర్  కామెరూన్ గ్రీన్ ను జట్టులో చేర్చింది.    ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడమే గాక బౌలింగ్ కూడా చేయగల సత్తా ఉన్న ఆటగాడు గ్రీన్. దీంతో అతడికి జట్టులో చోటు దక్కింది.  


బుధవారం గోల్ఫ్ ఆడుతూ గాయపడటంతో   ఇంగ్లిస్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంగ్లిస్ గాయాన్ని పరిశీలించిన వైద్య బృందం అతడికి విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో అతడిని  ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా.  

ఈ భర్తీని ఐసీసీ  ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ‘ఇంగ్లిస్ స్థానంలో గ్రీన్  ఆడేందుకు ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఓకే చెప్పింది..’ అని ఐసీసీ  తెలిపింది.  

గ్రీన్.. ఆసీస్ తరపున ఏడు టీ20లు ఆడాడు. 7 మ్యాచ్ లలో 136 పరుగులు చేసి బౌలింగ్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు.  భారత్ తో మొహాలీ వేదికగా ముగిసిన తొలి టీ20 అతడికి అంతర్జాతీయ  స్థాయిలో మొదటి టీ20 మ్యాచ్. మొహాలీతో పాటు హైదరాబాద్ మ్యాచ్ లో కూడా గ్రీన్ మెరుపులు మెరిపించాడు. రెండు మ్యాచ్ లలోనూ  వీరవిహారం చేసి రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 

అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియాలో వెస్టిండీస్, ఇంగ్లండ్ పై మాత్రం  అతడు పెద్దగా రాణించలేదు. మరి  టీ20 ప్రపంచకప్  కు ఎంపికైన  గ్రీన్ కు తుది జట్టులో చోటు దక్కుతుందా..? అతడు ఏ మేరకు రాణిస్తాడనేది  ప్రశ్నార్థకమే. 

మార్పులు చేసిన ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అస్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, జోష్ హెజిల్వుడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా 

Latest Videos

click me!