బంగ్లాదేశ్ టూర్‌కి డేట్ ఫిక్స్... డిసెంబర్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న టీమిండియా...

First Published | Oct 20, 2022, 3:45 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్న భారత జట్టు, ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించబోతోంది భారత జట్టు...

చివరిసారిగా 2015లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన భారత జట్టు, 2022 డిసెంబర్‌లో అక్కడ అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 టోర్నీలకు ఈ టూర్ కీలకంగా మారనుంది...

డిసెంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే బంగ్లా టూర్‌లో భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 4న మొదటి వన్డే, 7న రెండో వన్డే, 10న ఆఖరి వన్డే జరుగుతాయి. వన్డే మ్యాచులన్నీ మీర్‌పూర్ వేదికగానే జరగబోతున్నాయి..


వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నాలుగు రోజులకు డిసెంబర్ 14న చిట్టగాంగ్‌లో మొదటి టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 22న మీర్‌పూర్‌లో రెండో టెస్టు జరుగుతుంది. ఐదు రోజుల పాటు ఈ టెస్టు మ్యాచ్ జరిగితే బాక్సింగ్ డే రోజున బంగ్లా టూర్‌ని ముగించనుంది భారత జట్టు...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటిదాకా 12 మ్యాచులాడి 6 విజయాలు, 4 పరాజయాలు అందుకున్న భారత జట్టు, రెండు టెస్టులను డ్రా చేసుకుని నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం 52.08 విజయాల శాతంతో ఉన్న టీమిండియా ఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్‌లో జరిగే టెస్టు సిరీస్‌ని 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది...

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ని కూడా 4-0 గెలిస్తే... మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ రేసులోకి దూసుకొస్తుంది భారత జట్టు. మరోవైపు వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ 2021-23 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కి టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ కీలకంగా మారనుంది...

‘భారత్-బంగ్లా మధ్య ఇంతకుముందు జరిగిన కొన్ని మ్యాచులు క్రికెట్ ఫ్యాన్స్‌కి పూర్తి మజాని అందించాయి. ఈసారి కూడా ఈ పర్యటన అలాగే సాగుతుందని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు ఒప్పుకున్న బీసీసీఐకి ధన్యవాదాలు... భారత జట్టుకి స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్... 

Latest Videos

click me!