ఆడినా అంటారు.. ఆడకున్నా అంటారు.. ఎందుకంటే అతడు కోహ్లీ.. : విరాట్‌కు మద్దతుగా మాజీ క్రికెటర్

First Published Sep 1, 2022, 4:16 PM IST

Virat Kohli: క్రికెట్ నుంచి నెల రోజుల పాటు దూరంగా ఉండి స్వల్ప విరామం తర్వాత ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆటపై  విమర్శకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. బలహీన హాంకాంగ్ పై హాఫ్ సెంచరీ చేయడం పెద్ద గొప్పా..? అని కామెంట్స్ చేస్తున్నారు.
 

నెల రోజుల విరామం తర్వాత  బ్యాట్ పట్టిన  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో ఆడిన రెండు మ్యాచుల్లోనే మెరుగైన ప్రదర్శన చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. బుధవారం హాంకాంగ్ తో ముగిసిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ  సాధించాడు. 

Image credit: Getty

అయితే కోహ్లీ ఆటపై  విమర్శకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. బలహీన హాంకాంగ్ పై హాఫ్ సెంచరీ చేయడం పెద్ద గొప్పా..? అని కామెంట్స్ చేస్తున్నారు.  పాకిస్తాన్ తో మ్యాచ్ లో కోహ్లీ మరీ నెమ్మదిగా ఆడాడని, చెత్త షాట్ కు ఔటయ్యాడని కామెంట్స్ వెల్లువెత్తాయి.  

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ ఆడినా, ఆడకున్నా అతడికి విమర్శలు తప్పవని అభిప్రాయపడ్డాడు. హాంకాంగ్ తో విఫలమైతే కోహ్లీపై విమర్శకులు మరింత స్వరం పెంచేవారని చెప్పాడు. 

Image credit: Getty

హాంకాంగ్ తో మ్యాచ్ అనంతరం  నిఖిల్ చోప్రా ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘కొన్ని రోజుల విరామం తర్వాత కోహ్లీ మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నాడు. గత ఆదివారం పాకిస్తాన్ తో మ్యాచ్ తో పాటు  హాంకాంగ్ తో మ్యాచ్ లో  కోహ్లీ రాణించడం అతడికి ఆత్మవిశ్వాసాన్నిచ్చేదే. అందులో సందేహమే లేదు.

పాకిస్తాన్ తో మ్యాచ్ లో కోహ్లీ నెమ్మదిగా ఆడాడని అంటున్నారు. హాంకాంగ్ తో మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అతడు ఈ మ్యాచ్ లో ఆడి ఉండకుంటే అప్పుడు.. కోహ్లీ హాంకాంగ్ మీద కూడా ఆడలేదని అనేవారు. జాతీయ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు కోహ్లీపై ఒక బాధ్యత ఉంటుంది. అది చిన్న జట్టా..? పెద్ద జట్టా..? అనేది అనవసరం..’ అని తెలిపాడు.

హాంకాంగ్ తో మ్యాచ్ కోహ్లీ.. 44 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రోహిత్ శర్మ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన అతడు.. ముందు కెఎల్ రాహుల్ తో ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో సూర్య రెచ్చిపోతుంటే అవతలి ఎండ్ లో కోహ్లీ కూడా జూలు విదిల్చి రెండు భారీ సిక్సర్లు బాదాడు. 

click me!