ICC Womens T20 World Cup 2024 : ఆరంభంలోనే అపశకునం ... టీమిండియా ఘోర పరాజయం

First Published | Oct 4, 2024, 11:37 PM IST

ఐసిసి మహిళల టీ20 వరల్డ్ కప్ ఆరంభంలోనే టీమిండియా ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో టీమిండియా భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది.  

ICC Womens T20 World Cup 2024

ICC Womens T20 World Cup 2024 : పురుషుల టీ20 వరల్డ్ కప్ లో అద్భుత విజయాన్ని అందుకున్న రోహిత్ సేన స్పూర్తితో బరిలోకి దిగిన మహిళల టీంకు శుభారంభం లభించలేదు. ఐసిసి మహిళల టీ20 ప్రపంచ కప్ ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఈ పొట్టి క్రికెట్ టోర్నీలో తొలి మ్యాచ్ న్యూజిలాండ్ తలపడ్డ హర్మన్ ప్రీత్ సేన లక్ష్యచేధనలో తడబడింది. మొదట బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేసి బ్యాటింగ్ లో రాణించిన కివీస్ బౌలింగ్ లోనూ రాణించింది. దీంతో భారత జట్టు 102 పరుగులకే చేతులెత్తేసి ఓటమిపాలయ్యింది. 

ICC Womens T20 World Cup 2024

న్యూజిలాండ్ బ్యాటింగ్ సాగిందిలా : 

ఐసిసి మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ A లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి.  దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికయ్యింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బేట్స్ 27 పరుగులు (24 బంతుల్లో), ప్లిమ్మర్ 34 పరుగులు ( 23 బంతుల్లో) అద్భుతంగా ఆడారు. 

అయితే వెంటవెంటనే ఓపెనర్లు ఇద్దరూ ఔటయినా కివీస్ జోరు మాత్రం తగ్గలేదు. కెప్టెన్ డివైన్ భారత బౌలర్లపై చితకబాదారు... ఆమె కేవలం 36 బంతుల్లోనే 57 పరుగులు సాధించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగులు సాధించింది న్యూజిలాండ్ జట్టు. 
 


ICC Womens T20 World Cup 2024

టీమిండియాను చిత్తుచేసిన న్యూజిలాండ్ 

161 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలి వర్మ కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరువద్దే వికెట్ సమర్పించుకుంది. దీంతో 11 పరుగుల వద్దే టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఇలా మొదలైన వికెట్ల పతనం కొనసాగడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. 

స్మృతి మందాన 12, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 15, జెమిమా 13, రిచా ఘోష్ 12, దీప్తి శర్మ 13, అరుంధతి రెడ్డి 1, ఫూజా వస్త్రకర్ 8, శ్రేయాంక పాటిల్ 7, ఆశ శోభన 6(నాటౌట్), రేణుకా ఠాకుర్ 0 పరుగులు చేసారు. ఇలా టీమిండియా19 ఓవర్లలో కేవలం 102 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. 

కివీస్ బౌలర్లలో రోస్ మేరీ 4 ఓవర్లేసి 4 వికెట్లు పడగొట్టి భారత జట్టు నడ్డి విరిచింది. ఇక లియా తహుహు 3, ఇడెన్ కార్సన్ 2, అమెలియా 1 వికెట్ పడగొట్టారు. 
 

ICC Womens T20 World Cup 2024

పాయింట్ టేబుల్:

మొదటి మ్యాచ్ లో పరాజయాన్ని చవిచూసిన టీమిండియా గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్ లో చివరన నిలిచింది. న్యూజిలాండ్ మంచి పరుగులతో విజయం సాధించి టాప్ లో నిలిచింది.  ఇక శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 

ఇక గ్రూప్ బి లో కూడా ఇప్పటికే రెండు మ్యాచులు ముగిసాయి. అందులో బంగ్లాదేశ్ టాప్ లో నిలవగా  సౌతాఫ్రికా రెండో స్థానంలో వుంది. వెస్టిండిస్, స్కాట్లాండ్ లు ఒక్కో ఓటమితో చివరన నిలిచారు. ఇంగ్లాండ్ టీం ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 

Latest Videos

click me!