వికెట్లు తీయడం వారివల్ల కాదు.. ఎకానమీ అయినా పెంచుకుంటే బెస్ట్.. స్టార్ స్పిన్నర్లపై నోరుపారేసుకున్న మంజ్రేకర్

First Published Oct 29, 2021, 6:22 PM IST

ICC T20 Worldcup2021: టీ20 ప్రపంచకప్ లో ఆడుతున్న ఇద్దరు టీమిండియా స్టార్ స్పిన్నర్లు వికెట్లు తీయలేరని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. 

క్రికెటర్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు.  టీ20 ప్రపంచకప్ లో ఆడుతున్న ఇద్దరు టీమిండియా స్టార్ స్పిన్నర్లు వికెట్లు తీయలేరని.. వారు కనీసం ఎకానమీ రేట్ అయినా పెంచుకోవాలని సూచించాడు.

భారత బ్యాటింగ్ కంటే బౌలింగే తనను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తుందని మంజ్రేకర్ పేర్కొన్నాడు. వచ్చే  ఆదివారం భారత్-న్యూజిలాండ్ కీలక పోరుకు సిద్ధమవుతున్న వేళ అతడు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఓ ఆంగ్ల వెబ్ సైట్ కు మంజ్రేకర్ వ్యాసం రాస్తూ.. ‘అశ్విన్, జడేజా ఇద్దరూ వికెట్లు తీసే బౌలర్లు కాదు. వాళ్లిద్దరూ వికెట్లు తీయడం కంటే ఎకానమీ రేట్ మీద అయినా దృష్టి పెడితే మంచిది. 

టీ20 లలో స్పిన్నర్లు కీలకం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో  వికెట్లు తీసి వాళ్లు గేమ్ ఛేంజర్లుగా మారుతారు’ అని సంజయ్ పేర్కొన్నాడు.  అంతేగాక భారత బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగమే తనను  అధిక ఆందోళనకు గురి చేస్తున్నదని రాసుకొచ్చాడు. 

‘నాకు  ఇండియా బౌలింగ్ గురించే ఆందోళనగా ఉంది. ఒక భారీ పరాజయం తర్వాత చాలా మంది జట్టుకు మద్దతిస్తున్నారు. అది చేయవలసిందే. కానీ ఐపీఎల్ వంటి భారీ సీజన్ ఆడి.. అసలు పరాజయాల బాట పడితే అది ప్రపంచకప్  కోసం చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరు వంటిదే’ అని తెలిపాడు. 

గతవారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్.. ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 151 పరుగులే చేసింది. దానిని కాపాడుకోవడంలో భారత బౌలర్లు దారుణంగా విపలమయ్యారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

టీ20 ప్రపంచకప్ కోసం భారత్..సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా తో పాటు యువ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ లను కూడా ఎంపిక చేసింది. అయితే తొలి మ్యాచ్ లో వరుణ్, జడేజా మాత్రమే ఆడారు.

ఇక మంజ్రేకర్.. జడేజా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్తకాదు. గతంలో కూడా ఆయన ఇదే విధంగా మాట్లాడాడు. జడేజాకు ఇంగ్లీష్ రాదని, అతడి బ్యాటింగ్ లో లోపాలున్నాయని వ్యాఖ్యానించి జడ్డూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. 

click me!