T20 World cup: మూడు ప్రపంచకప్ లు అందించడమే నా కల.. మనసులో మాట చెప్పిన టీమిండియా ఓపెనర్

First Published Nov 5, 2021, 6:18 PM IST

KL Rahul: 2011 ప్రపంచకప్ సమయంలో తాను చిన్నవాడినని, ఆ మ్యాచులు చూసినప్పట్నుంచే ఒక విషయాన్ని బలంగా నిర్ణయించుకున్నానని కెఎల్ రాహుల్ తెలిపాడు. 

టీ20లు, వన్డేలు, టెస్టులలో భారత్ కు ఓపెనర్ గా బరిలోకి దిగి తన అద్భుత ఆటతీరుతో ప్రశంసలు అందుకుంటున్న కెఎల్ రాహుల్ తన మనసులో మాట బయటపెట్టేశాడు. చాలా కాలం తర్వాత భారత్ కు నాణ్యమైన ఓపెనర్ కొరతను తీర్చిన రాహుల్.. టీమిండియా కోసం తాను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాడు.

భారత్ కు మూడు ప్రపంచకప్ లు అందించడమే తన కల అని ఈ భావి భారత కెప్టెన్ గా పరిగణిస్తున్న కెఎల్ రాహుల్ అన్నాడు.  అందుకోసం  తన వంతు కృషి చేస్తానని చెప్పాడు. 

2011 ప్రపంచకప్ సమయంలో తాను చిన్నవాడినని, ఆ మ్యాచ్ లు చూసినప్పట్నుంచే ఒక విషయాన్ని బలంగా నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అతడు  పలు  ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ.. తన ట్విట్టర్ లో పంచుకుంది. 

రాహుల్ మాట్లాడుతూ.. ‘పెద్దవాడినవుతున్న సమయంలో నేను 2011 ప్రపంచకప్ మ్యాచ్ లను ఇంట్లో చూశాను. అవి నా మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేశాయి. అప్పుడే అనుకున్నాను. 

నేను చేయాల్సిందే కూడా ఇదే. నా దేశానికి ప్రపంచకప్ అందించాలని నేను నిర్దేశించుకున్నాను. ఒకటి.. రెండు..మూడు వరల్డ్ కప్ లు.. ఇలా ఎన్నైనా సరే.. ప్రపంచకప్  జట్టులో నేను భాగమై చరిత్ర సృష్టించాలనుకున్నాను’ అని తెలిపాడు. 

జూనియర్ క్రికెటర్ గానే భారత క్రికెట్ లోకి అడుగుపెట్టిన రాహుల్..  ఇంతవరకు ప్రపంచపక్ నెగ్గిన జట్టులో సభ్యుడు కాలేదు. 2010లో అతడు అండర్-19 ప్రపంచకప్ లో రాహుల్ ఆడాడు. కానీ ఆ టోర్నీలో భారత్ ఓడిపోయింది. 

ఇక  సీనియర్ జట్టులో కూడా.. 2019 వన్డే ప్రపంచకప్ లో భారత్ తరఫున రాహుల్ పాల్గొన్నాడు. కానీ ఆ ప్రపంచకప్ లో టీమిండియా..  సెమీఫైనల్లో  న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ గెలువకపోయినందుకు తాను చాలా బాధపడ్డానని రాహుల్ అన్నాడు. 

KL Rahul

కాగా.. యూఏఈలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో రాహుల్..  తొలి రెండు మ్యాచులలో విఫలమయ్యాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో 3 పరుగులకే ఔటైన రాహుల్.. కివీస్ తో పోరులో 18 పరుగులు చేశాడు. ఇక రెండ్రోజుల  క్రితం అఫ్గాన్ తో  ముగిసిన మ్యాచ్ లో 48 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి  ఓపెనింగ్ వికెట్ కు  రికార్డు స్థాయిలో 140 పరుగులు జోడించాడు.  

click me!