T20 World Cup: టీమిండియాను చిత్తుచిత్తుగా ఓడించిన జట్టుకు మద్దతిస్తున్న గంగూలీ.. పైగా ఆ జట్టుపై ప్రశంసలు

First Published Nov 14, 2021, 6:24 PM IST

Australia Vs New Zealand: ఐసీసీ ఈవెంట్లలో భారత ప్రయాణానికి అడ్డుపుల్లలు వేస్తున్న జట్టు అది.  ప్రస్తుతం జరుగుతున్న టీ20  ప్రపంచకప్పే కాదు.. ఈ ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2019 వన్డే ప్రపంచకప్ లలో కూడా మనం ఫైనల్ కు వెళ్లకుండా అడ్డుకుంది. ఇప్పుడు అదే జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు మద్దతు ప్రకటించాడు.

టీ20 ప్రపంచకప్  తుది అంకానికి వేళైంది.  ఆదివారం  అర్ధరాత్రి కొత్త ప్రపంచ ఛాంపియన్ అవతరించబోతున్నది.  ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగనున్న ఈ పోరులో విజేత ఎవరనేది టాస్ తోనే తేలిపోతుందని విశ్లేషకుల మాట. అయితే ఈ టోర్నీలో.. గ్రూప్ దశలో భారత్ ను చిత్తుగా ఓడించి.. ఆ తర్వాత టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకట్ట వేసిన జట్టుకే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలుస్తుండటం గమనార్హం. 

అవును.. ఒక్క ఈ ప్రపంచకప్ లోనే కాదు.  ఐసీసీ ఈవెంట్లలో  భారత్ కు భస్మాసుర హస్తం అడ్డుగా పెడుతున్న న్యూజిలాండ్ జట్టుకు గంగూలీ మద్దతుగా  నిలిచాడు.  ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో దాదా న్యూజిలాండ్ కు మద్దతు ప్రకటించాడు. 

ఆదివారం నాటి పోరులో  కివీస్ గెలుస్తుందని గంగూలీ అంచనా వేశాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు న్యూజిలాండ్ టైం నడుస్తున్నది. ఆస్ట్రేలియా గొప్ప జట్టే.. కానీ కొద్దికాలంగా వాళ్లు గడ్డుకాలాన్ని ఎదుర్కుంటున్నారు.

ఇక న్యూజిలాండ్ జట్టు మనం టీవీలలో చూస్తున్న దానికంటే ఎక్కువ సత్తా కలిగిఉంది. ఈ ఏడాది జరిగిన  ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ను వాళ్లు గెలుచుకున్నారు. అదొక చిన్న దేశం. కానీ ఆ ఆటగాళ్లలో చాలా ప్రతిభ దాగి ఉంది. 

నేటి మ్యాచ్ విషయానికొస్తే నేను న్యూజిలాండ్ గెలుస్తుందని అనుకుంటున్నాను’ అని చెప్పాడు. గత కొద్దికాలంగా ఆ జట్టు నిలకడగా రాణిస్తుందన్న గంగూలీ..  ఈ సారి ప్రపంచకప్ నెగ్గేది కేన్ విలియమ్సన్ సేన అని చెప్పకనే చెప్పాడు.

ఇక ప్రపంచకప్ లో భారత పేలవ ప్రదర్శన గురించి కూడా గంగూలీ స్పందించాడు. ‘టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందులో సందేహమే లేదు. కానీ ఫలితం ఏదైనా మెజారిటీ ప్రజలు దాన్ని ఆమోదించారు. 

అభిమానులు కాస్త నిరాశ చెందిన మాట వాస్తవమే కానీ వాళ్లు అతిగా మాత్రం రియాక్ట్ కాలేదు. ఏదేమైనా రెండు చెత్త మ్యాచులు ఆడినంత మాత్రానా మనం వెనుకబడినట్టు కాదు. అది ఒక నలభై ఓవర్ల చెడ్డ క్రికెట్ అనుకోండి.

వాళ్లు (టీమిండియా) మళ్లీ పుంజుకుంటారు. ఒక ఏడాది, ఆతర్వాత ఇదే ఆటగాళ్లు మెగా టోర్నీలను గెలుస్తారు. అది మనం తప్పకుండా చూస్తాం..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

టీ20 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ జట్టు.. సూపర్-12 దశలో భారత్ ను దారుణంగా ఓడించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20  ఓవర్లలో 110 పరుగులే చేసింది. అనంతరం కివీస్.. 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.  ఆ తర్వాత అఫ్గాన్  ను ఓడించి  టీమిండియా సెమీస్ కలలను కల్లలు చేసింది. 

click me!