T20 World cup: అతడి రాక మాకు ఎంతో సానుకూలం.. అశ్విన్ పై టీమిండియా సారథి ప్రశంసలు

First Published Nov 4, 2021, 2:26 PM IST

Virat kohli Praises Ashwin: అశ్విన్ పునరాగమనం జట్టులో సానుకూలతను నింపిందని విరాట్ కోహ్లి అన్నాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చినా అశ్విన్ మాత్రం..  అతడు ఎప్పుడూ వికెట్ టేకింగ్ బౌలర్ అని ప్రశంసించాడు.

నాలుగేళ్ల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. నిన్నటి అఫ్గాన్ తో మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన రవి అశ్విన్.. 14 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

ఈ ప్రదర్శన గురించి భారత సారథి విరాట్ కోహ్లి స్పందించాడు.  అశ్విన్ పునరాగమనం జట్టులో సానుకూలతను నింపిందని అన్నాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చినా అశ్విన్ మాత్రం.. చక్కగా బౌలింగ్ చేశాడని, అతడు ఎప్పుడూ వికెట్ టేకింగ్ బౌలర్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

అఫ్గాన్ తో మ్యాచ్ అనంతరం  విలేకరుల సమావేశంలో కోహ్లి మాట్లాడుతూ.. ‘అతడు (అశ్విన్) వికెట్ టేకింగ్ బౌలర్. అంతేకాదు తెలివిగా బంతులు వేస్తాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో చూపిన నియంత్రణ, లయను కొనసాగించాడు. 

ఆష్ (అశ్విన్ ను జట్టు సభ్యులు పిలుచుకునే పేరు) పునరాగమనం నిజంగా జట్టులో సానుకూలతను తీసుకొచ్చింది. అతడు ఎంతగానో  కష్టపడ్డాడు’ అని తెలిపాడు.

గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఆడిన అశ్విన్.. తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక టీ20లలో అయితే నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ కు అశ్విన్ ఎంపికైనా.. అతడు మాత్రం బెంచ్ కే పరిమితమయ్యాడు. 

ఈ టోర్నీలో టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో జడేజా తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వైపే విరాట్ మొగ్గు చూపాడు. దాంతో అశ్విన్  డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. 

అశ్విన్ ను ఆడించడం విరాట్ కు ఇష్టం లేదని, ఇద్దరి మధ్య సంబంధాలు బాగాలేవని గతంలో పలు పత్రికలు కథనాలు కూడా రాశాయి. ఇటీవల  ఐపీఎల్ సందర్భంగా కూడా  ఓ  వార్త సంచలనమైంది.

విరాట్ కోహ్లి.. తమపట్ల దురుసుగా ప్రవర్తించాడని టీమిండియాకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారని, లేఖలో అందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారని ఆ వార్త సారాంశం. అయితే ఈ లేఖ రాసినవారిలో..  పుజారా, అశ్విన్ పేర్లే  వినిపించాయి.  తర్వాత బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇలాంటిదేమీ లేదని కొట్టిపారేసాడు.

టీ20 ప్రపంచకప్ కు కూడా అశ్విన్ ను ఎంపికచేయడం కోహ్లికి ఇష్టం లేదని, కానీ జట్టు మేనేజ్మెంటే అతడిని ఒప్పించిందని కూడా గుసగుసలు వినిపించాయి. జట్టులోకి స్థానం వచ్చినా.. రెండు మ్యాచ్ లకు అశ్విన్ ను కావాలనే పక్కనబెట్టారని విమర్శకులు ఘాటైన  వ్యాఖ్యలు చేయడంతో.. అఫ్గాన్ తో మ్యాచ్ లో అతడిని ఆడించారు. 

click me!