T20 World Cup: రెండున్నర దశాబ్దాల తర్వాత పాక్ కు ఆసీస్.. పెళ్లి కోసం మ్యాక్స్వెల్ దూరం

First Published Nov 9, 2021, 4:19 PM IST

Glenn Maxwell: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టు.. పాకిస్థాన్ పర్యటనకు రానున్నది. మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడే నిమిత్తం ఆసీస్ జట్టు.. పాక్ కు పయనం కానున్నది.  అయితే ఈ  సిరీస్ కు మ్యాక్సీ అందుబాటులో ఉండేది అనుమానమే..

సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటనకు రానున్నది. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ లో ఆ పర్యటన జరుగనున్నట్టు సోమవారం ఇరు దేశాల క్రికెట్  బోర్డులు అధికారిక ప్రకటన కూడా చేశాయి. అయితే ఈ పర్యటనకు తాను అందుబాటులో ఉండనని ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ వెల్లడించాడు.

ఆ సమయంలో తన పెళ్లి ఉందని, దాంతో తాను పాకిస్థాన్ పర్యటనకు వెళ్లలేనేమో అని తెలిపాడు.  ఆసీస్ తరఫున.. పరిమిత ఓవర్ల క్రికెట్ తో పాటు వన్డే జట్టులో కూడా సభ్యుడిగా ఉన్న మ్యాక్సీ.. వచ్చే ఏడాది భారత సంతతికి చెందిన యువతితో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు.

భారత సంతతికి చెందిన విని రామన్ తో  మ్యాక్స్వెల్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. 2016 లో ఓ వివాహ వేడుకలో కలుసుకున్న ఈ జంట.. 2020 లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. దక్షిణ భారత మూలాలున్న రామన్.. మెల్బోర్న్ లోనే పుట్టి పెరిగింది. ఆమె అక్కడే ఫార్మాసిస్టుగా పనిచేస్తున్నది.  

కరోనా కారణంగా వీరిద్దరి  వివాహం వాయిదా పడుతూ వస్తున్నది.  అయితే కొవిడ్ పరిస్థితులు నెమ్మదిగా సద్దుమణుగుతుండటంతో వచ్చే ఏడాది ఎలాగైనా మ్యాక్సీ ని తన కొంగుకు చుట్టేసుకోవాలని రామన్ భావిస్తున్నది.

పాకిస్థాన్ పర్యటనపై మ్యాక్సీ మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కాలం తర్వాత మేము (ఆసీస్) పాక్ టూర్ కు వెళ్తుండటం చాలా గొప్ప  అనుభూతి. అయితే నేను ఆ సిరీస్ లో పాల్గొంటానా..? లేదా..? అన్నది మాత్రం నా చేతుల్లో లేదు..’ అని తెలిపాడు. ‘సరిగ్గా పాక్ తో సిరీస్ సమయంలోనే నా వివాహ కార్యక్రమం ఉంది. దీంతో నేను పాక్ టూర్ కు వెళ్లలేనేమో..’ అని మ్యాక్స్వెల్ అన్నాడు. 

ఒకవేళ ఈ సిరీస్ కోసం మీ వెళ్లమని మీకు కాబోయే భార్య చెప్తే మీరు వెళ్తారా..? అని మ్యాక్సీని అడగ్గా.. ‘అసలు ఛాన్సే లేదు. ఇప్పటికే మేము చాలా సార్లు డేట్ ఫిక్స్ చేసి వాయిదా వేసుకున్నాం. ఈసారి మాత్రం ఆ ఆప్షనే లేదు..’ అని చెప్పాడు. 

కాగా.. 2022 మార్చి లో పాక్ పర్యటనకు రానున్న ఆసీస్.. ఆ జట్టుతో మూడు  ఫార్మాట్లలోనూ పోటీ పడబోతున్నది. పాక్ తో మూడు టెస్టులు.. మూడు వన్డేలు.. ఒక టీ20 మ్యాచ్ ఆడనున్నది. దీనికోసం ఇప్పటికే షెడ్యూలు కూడా విడుదలైంది.

ఆసీస్ ఆఖరుసారిగా 1998లో పాక్ లో పర్యటించింది. ఆ తర్వాత ఏకంగా రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ పాకిస్థాన్  పర్యటనకు రానున్నది. ఇదిలాఉండగా టీ20 ప్రపంచకప్ లో ఈనెల 11న ఆసీస్.. సెమీస్ లో పాక్ ను ఢీకొనబోతున్న విషయం తెలిసిందే. 

click me!