T20 World Cup: వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ కు దక్కే ప్రైజ్ మనీ అంతేనా..? ఐపీఎల్ రన్నరప్ తో పోల్చినా తక్కువే..

First Published Nov 15, 2021, 11:52 AM IST

T20 World Cup Prize Money: కొత్త చరిత్రను లిఖిస్తూ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియాకు ఈ టోర్నీ నెగ్గడం ద్వారా వచ్చిన మొత్తంతో పోల్చితే  ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో రన్నరప్ కంటే తక్కువే కావడం గమనార్హం. 

టీ20 ప్రపంచకప్ లో చరిత్ర తిరగరాస్తూ కొత్త ఛాంపియన్ గా అవతరించింది ఆస్ట్రేలియా. ఫైనల్లో ఆ జట్టు న్యూజిలాండ్ ను మట్టి కరిపించి మొదటి టీ20 ప్రపంచకప్ ఎగరేసుకుపోయింది. అయితే దీని ద్వారా ఆసీస్ కు దక్కే   ప్రైజ్ మనీ ఎంత..?  రన్నరప్ న్యూజిలాండ్ కు  ఎంత వచ్చింది. సెమీస్, సూపర్-12 దశల్లో ఆడిన జట్లకు మిగేలేది ఎంత..? 

ఈ విషయాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ చూద్దాం. ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 5.6 మిలియన్ డాలర్ల (42 కోట్ల రూపాయలు) ను  ప్రకటించింది. ఫైనల్లో దుమ్ము రేపే ప్రదర్శనతో  అదరగొట్టిన ఆసీస్, రన్నరప్ కివీస్ తో పాటు అన్ని జట్లకు  ఈ ప్రైజ్ మనీ నుంచే పంచుతారు. 

ఫైనల్ నెగ్గిన ఆసీస్ కు 16 లక్షల డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ. 11.89 కోట్లు దక్కనున్నాయి.  రన్నరప్ గా నిలిచిన కివీస్ కు 8 లక్షల డాలర్లు.. (రూ. 5.94 కోట్లు) అందుతాయి. 

సెమీస్ లో ఓడిన జట్లకు  రూ. 2.97 కోట్లు (ఒక్కో జట్టుకు) దక్కుతాయి. గ్రూప్-1 నుంచి ఇంగ్లాండ్ సెమీస్ కు చేరగా.. గ్రూప్-2 నుంచి పాకిస్థాన్ కూడా సెమీఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. వీటితో పాటు గ్రూప్ దశల్లో ఆ జట్లు గెలిచిన వాటికి కూడా ప్రైజ్ మనీ దక్కనుంది. ఈ మేరకు పాక్ కు అదనంగా మరో రూ. 4.5 కోట్లు, ఇంగ్లాండ్ కు రూ. 4.2 కోట్లు అందనుంది. 

ఇక సూపర్-12లో  ఆడిన జట్లకు రూ. 52 లక్షలతో పాటు విజయాల ఆధారంగా ఒక్కో మ్యాచుకు రూ. 30 లక్షల మేర  అందనుంది. అంటే సూపర్-12లో నిష్క్రమించిన టీమిండియాకు ఈ టోర్నీలో దక్కిన మొత్తం రూ. 1.42 కోట్లు. ఐదింటిలో మనం రెండు ఓడగా.. మూడు గెలిచాం.

ఇక టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచులలో భాగంగా.. ఓమన్, ఐర్లాండ్, పపువా న్యూ గినియా, నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడ్డాయి.  వీటిలో శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నమీబియా అర్హత సాధించాయి.  క్వాలిఫై అయినందుకు గాను  ఈ నాలుగు జట్లకు రూ. 30 లక్షలు అందాయి. ఆ తర్వాత విజయాల ఆధారంగా మిగతా ప్రైజ్ మనీ అందనుంది. 

ఇదిలాఉంటే.. ఇంత పెద్ద  ఈవెంట్ నిర్వహించిన ఐసీసీ ప్రైజ్ మనీ ఇటీవల బీసీసీఐ  ఆధ్వర్యంలో  జరిగిన క్యాష్ రిచ్ లీగ్  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 

ఐపీఎల్-14లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు దక్కిన ప్రైజ్ మనీ రూ. 20 కోట్లు. రన్నరప్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ కు రూ. 12.50 కోట్లు. కానీ ఐసీసీ విజేతకు దక్కింది రూ. 11.89 కోట్లు. అంటే ఐపీఎల్ రన్నరప్ కు దక్కిన మనీ కూడా ఐసీసీ విజేతకు దక్కలేదు.

click me!