డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్ లో బెస్ట్ టెస్టులను ప్రకటించిన ఐసీసీ.. ఆ ఐదు మ్యాచ్‌లివే..

First Published Mar 24, 2023, 3:45 PM IST

WTC Finals: బోర్దర్ - గవాస్కర్ ట్రోఫీలో  ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ తో ఈ సైకిల్ కు ఎండ్ కార్డ్ పడింది.  డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి  ఆస్ట్రేలియా-ఇండియా మధ్యే జరుగనుంది. 

రెండేండ్ల పాటు జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ లో భాగంగా  2021-23  సీజన్ ఇటీవలే ముగిసింది.  బోర్దర్ - గవాస్కర్ ట్రోఫీలో  ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ తో ఈ సైకిల్ కు ఎండ్ కార్డ్ పడింది.  డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి  ఆస్ట్రేలియా-ఇండియా మధ్యే జరుగనుంది. కాగా  ఈ  సైకిల్ లో  బెస్ట్  టెస్టు మ్యాచ్ లు అనదగ్గవి  ఐదింటిని ఎంపిక చేసింది ఐసీసీ. ఆ వివరాలను తాజాగా ప్రకటించింది.  

ఈ జాబితాలో ఉన్న తొలి టెస్టు.. ఇటీవలే  న్యూజిలాండ్ - శ్రీలంక మధ్య క్రిస్ట్‌చర్చ్ లో జరిగిన మొదటి టెస్టు. ఐదో రోజు ఆట చివరి ఓవర్  లో ఫలితం  తేలిన ఈ మ్యాచ్.. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.  ఈ మ్యాచ్ లో  శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 355 పరుగులు చేసింది. బదులుగా కివీస్ 373 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో లంక 302 రన్స్ చేసింది.  286 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్  తడబడింది. చివరి ఓవర్లో  చివరి బంతికి   గెలిచింది. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. 

పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య గతేడాది రావాల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు.  17 ఏండ్ల తర్వా పాక్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్..  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ లో   657 పరుగుల భారీ స్కోరు చేసింది.  పాకిస్తాన్ కూడా తొలి ఇన్నింగ్స్ లో   579 పరుగులు  చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. 264 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.  343 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. ఆఖరి రోజు  మరో ఐదు ఓవర్లు ఉన్నాయనగా 268 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 

శ్రీలంక - పాకిస్తాన్ మధ్య   2022లో గాలె వేదికగా జరిగిన  తొలి టెస్టు.. ఈ మ్యాచ్ లో  లంక తొలుత బ్యాటింగ్ చేసి  222 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ కూడా  218 పరుగులకే  చాపచుట్టేసింది.  రెండో ఇన్నింగ్స్ లో లంక..  337 పరుగులు చేసింది.  347 పరుగుల లక్ష్య ఛేదనలో   పాకిస్తాన్ విజయానికి 11 పరుగుల దూరంలో ఉండగా వర్షం పడింది. అసలు మ్యాచ్ జరుగడమే గగనమనుకున్న తరుణంలో   వాన  విరామమివ్వడంతో మ్యాచ్ ప్రారంభమై పాక్ విక్టరీ కొట్టింది. 

ఇంగ్లాండ్ - ఇండియా : బర్మింగ్‌‌హామ్ వేదికగా ముగిసిన ఈ టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 132 పరుగుల ఆధిక్యం సాధించి.. ఆ తర్వాత  రెండో ఇన్నింగ్స్ లో  245  రన్స్ కే ఆలౌట్ అయింది.  378 పరుగుల ఛేదనను ఇంగ్లాండ్.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.

ఇండియా - న్యూజిలాండ్ :  2021లో  కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టు డ్రా గా తేలింది. తొలి  ఇన్నింగ్స్ లో భారత్ 345 పరుగులకు ఆలౌట్ అయింది.   కివీస్  కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో  296 పరుగులు చేసింది.  రెండో ఇన్నింగ్స్ లో ఇండియా.. 234 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.  284 పరుగుల ఛేదనలో  కివీస్.. 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. కానీ   చివరి వికెట్ తీయడానికి భారత బౌలర్లు తంటాలు పడ్డారు.  రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ లు  అద్భుత పోరాటం చేసి చివరి వికెట్ కు గోడ కట్టేశారు. 

click me!