నేనైతే వాళ్లిద్దరిపై శాశ్వతంగా నిషేధం విధించేవాడిని : రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్

First Published Dec 31, 2022, 1:59 PM IST

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడి  పదవి నుంచి వైదొలిగిన తర్వాత  రమీజ్ రాజా తనపై గతంలో విమర్శలు సందించినవారిని టార్గెట్ గా చేసుకుని వారికి ఘాటు కౌంటర్లు ఇస్తున్నాడు. తాజాగా ఇద్దరు పాక్ మాజీలపై  రమీజ్ రాజా ధ్వజమెత్తాడు. 

పాకిస్తాన్ క్రికెట్ లోనే గాక అంతర్జాతీయంగా   దిగ్గజ పేసర్లుగా ప్రసిద్ధిగాంచినవారిలో  వసీం అక్రమ్, వకార్ యూనిస్ లు తప్పకుండా ఉంటారు.  ఇటీవలే పీసీబీ చైర్మెన్ పదవి నుంచి తొలగింపునకు గురైన రమీజ్ రాజా  కూడా వీళ్లతో కలిసి ఆడినవాడే. అయితే తన పాత మిత్రులపై  రమీజ్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

తనకే గనక అధికారం ఉంటే అక్రమ్ తో పాటు వకార్ లను శాశ్వతంగా నిషేధించేవాడినని  చెప్పుకొచ్చాడు.  ఆ ఇద్దరూ  స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కోవడంపై  రమీజ్ స్పందించాడు.   వాళ్లు చేసింది మాములు తప్పు కాదని వాపోయాడు. 
 

వసీం అక్రమ్ తో పాటు వకార్ లు 1993-94లలో  స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్నారు.  ఈ ఇద్దరితో పాటు  సలీమ్ మాలిక్ పైనా  ఆరోపణలు రావడంతో దీనిపై  జస్టిస్ ఖయ్యూం కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో  అక్రమ్, వకార్ ల పేర్లు ఉన్నాయి. 

ఇక రమీజ్ ను పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత అతడు ఇదే విషయమై ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘వాళ్లెవరికీ తిరిగి జట్టుతో అవకాశమే ఉండకూడదని నేను అనుకుంటున్నాను.  ఇందులో ఆరోపణలు ఎదుర్కున్న ఎవరికీ  జట్టులోకి వచ్చే అవకాశమే ఉండకూడదని అనుకున్నా. 
 

వాళ్ల (అక్రమ్, వకార్)ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నా చేతిలో పవర్ లేదు. ఒకవేళ నేనే నిర్ణయాధికారంలో గనక ఉంటే తప్పకుండా వారిపై జీవిత కాలం నిషేధం విధించేవాడిని.  దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాకు తెలిసి ఈ  ఫిక్సింగ్ కేసులో చాలా మంది  ఉన్నారని నా అనుమానం. వారిని ఎందుకు వదిలేశారో నాకైతే తెలియదు..’ అని అన్నాడు. 

2010లో  మహ్మద్ అమీర్, మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ ల మీద కూడా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. వీరిమీద విచారణ జరిపిన పీసీబీ.. భట్, అమీర్, అసిఫ్ లపై నిషేధం విధించింది. అమిర్  2016లో తిరిగి పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రమీజ్ రాజా పీసీబీ  చైర్మెన్  అయ్యాక  వీళ్లెవరినీ  సెలక్షన్స్ సమయంలో పరిగణించలేదు. అయితే ఈ విషయం మీద కూడా రమీజ్ తనదైన రీతిలో వ్యాఖ్యానించాడు.   ‘నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇలాంటి తప్పులు చేసిన వారు ఎంతటి  స్థాయి వ్యక్తులైనా  తప్పించుకోకూడదు..’ అని అన్నాడు. 
 

click me!