ఒత్తిడిని తట్టుకోలేక నేను టాయ్‌లెట్‌కు వెళ్లా: ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published | Nov 3, 2022, 2:30 PM IST

T20 World Cup 2022: పొట్టి ప్రపంచకప్ లో భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా ఉత్కంఠభరితంగా సాగింది.  డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో  టీమిండియా విజయం సాధించినా.. ఆఖరి ఓవర్ వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. 
 

బుధవారం అడిలైడ్ వేదికగా ముగిసిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఉత్కంఠంగా ముగిసిన విషయం తెలిసిందే.  భారత్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్.. తొలుత ఛేదించేలా కనిపించింది. మొదటి పవర్ ప్లే  లో లిటన్ దాస్ విధ్వంసంతో ఓ దశలో మ్యాచ్ ను బంగ్లాదేశ్ 15ఓవర్లలోనే ముగించేలా కనిపించింది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ గతి మారిపోయింది. 

వర్షం  ఆగిపోయాక  తిరిగి ప్రారంభమైన మ్యాచ్ లో భారత్ రెచ్చిపోయింది. లిటన్ దాస్ ను కెఎల్ రాహుల్  రనౌట్ చేశాక మ్యాచ్ గమనమే మారిపోయింది. అయితే దాస్ ఔటైనా.. షకిబ్, శాంతో,  టస్కిన్ లు చివరివరకూ  పోరాడారు.  చివరి ఓవర్లో  19 పరుగులు చేయాల్సి ఉండగా  బంగ్లా 14 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్.. 5 పరుగుల తేడాతో  విజయం సాధించింది. 


అయితే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ కు ముందు భారత్ గతంలో కూడా బంగ్లాదేశ్ తో  ఇటువంటి థ్రిల్లింగ్ మ్యాచ్ లే పలు ఆడింది. అందులో 2016 టీ20 ప్రపంచకప్ లో భాగంగా బెంగళూరులో  జరిగిన మ్యాచ్ కూడా ఒకటి.  తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆ మ్యాచ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఆ మ్యాచ్ లో కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తించిన శాస్త్రి.. నిన్న ముగిసిన మ్యాచ్ సందర్భంగా  అప్పటి జ్ఞాపకాలను  నెమరువేసుకున్నాడు. చివరి ఓవర్లో  ఒత్తిడిని భరించలేక  తాను టాయ్లెట్ కు వెళ్లానని చెప్పుకొచ్చాడు. 
 

శాస్త్రి మాట్లాడుతూ.. ‘నేను ఆ మ్యాచ్ లో ధోని చివరి ఓవర్ ను హార్ధిక్ పాండ్యా కు ఇవ్వడం చూశాను. అప్పుడే నేను టాయ్లెట్ కు వెళ్లాను.  ఆ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోయా.  ఆ ఓవర్లో తొలి మూడు బంతులకు 9 పరుగులు రావడంతో భారత్, బంగ్లా ప్లేయర్లు బాల్కనీలో నిల్చుని ఏం జరుగుతుందో చూశారు. కానీ నేను మాత్రం టెన్షన్ తట్టుకోలేక టాయ్లెట్ కు వెళ్లాను..’ అని చెప్పుకొచ్చాడు. 

2016 టీ20  ప్రపంచకప్ లో  భాగంగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య ముగిసిన మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది.  లక్ష్యాన్ని సాధించే క్రమంలో బంగ్లాదేశ్ విజయం అంచుల దాకా వచ్చింది.  చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా తొలి మూడు బంతులకు 9 పరుగులొచ్చాయి. నాలుగు, ఐదో బంతికి బంగ్లా వికెట్లు కోల్పోయింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా బంగ్లా బ్యాటర్ ముష్పీకర్ రెహ్మాన్ రనౌట్ అయ్యాడు.దీంతో భారత్ విజయాన్ని అందుకుంది.  

Latest Videos

click me!