ఆ సమయంలో ఊపిరాడలేదు.. కాస్తా ఆలస్యమై ఉంటే... షాకింగ్ న్యూస్ చెప్పిన పాక్ ఓపెనర్

First Published Nov 16, 2021, 2:29 PM IST

Mohammad Rizwan: హాస్పిటల్ నుంచి వచ్చి నేరుగా మ్యాచ్ ఆడిన రిజ్వాన్ సెమీస్ లో యోధుడిలా పోరాడాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆ జట్టు ప్రదర్శన మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.

టీ20 ప్రపంచకప్ లో భాగంగా  రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. అపజయమెరుగని జట్టుగా టోర్నీలో సెమీస్ కు వచ్చిన Pakistan..అనూహ్యంగా Australia మీద ఓడింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆ జట్టు ప్రదర్శన మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సెమీస్ లో ఆ జట్టు ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ పోరాటం  ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 

ఆసీస్ తో సెమీస్ మ్యాచ్ కు ముందు రెండ్రోజులు  అనారోగ్య కారణాలతో  రిజ్వాన్..  హాస్పిటల్ లో గడిపాడు. మ్యాచ్ కు ముందు రోజు రాత్రి అతడు జట్టుతో చేరాడు. అయితే ఇందుకు సంబంధించిన విషయాలను రిజ్వాన్ ఒక పాకిస్థాన్ ఛానెల్ తో పంచుకున్నాడు. 

రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘నేను హాస్పిటల్ కు చేరినప్పుడు నాకు శ్వాస ఆడటం లేదు. నర్సులు పరీక్ష చేసి నా శ్వాసనాళాల్లో సమస్య ఉందని గుర్తించినట్టు చెప్పారు. అంతే.. అంతకు మించి వాళ్లు నాకు ఏమీ చెప్పలేదు. 

అయితే మరుసటి రోజు ఉదయం వరకు నేను డిశ్చార్జి అవుతానని అక్కడకు వచ్చిన డాక్టర్ నాతో చెప్పాడు. కానీ మధ్యాహ్నం సమయంలో నాకు పరీక్షలు నిర్వహించడానికి వచ్చిన నర్సుతో నేను సాయంత్రం వరకు డిశ్చార్జి కావాలని అనుకుంటున్నానని చెప్పాను.  కానీ అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. 

నా శ్వాసనాళాలు దెబ్బతిన్నాయని,  ఒకవేళ నేను హాస్పిటల్ కు  వెళ్లడం 20 నిమిషాలు ఆలస్యమయ్యుంటే అవి పూర్తిగా చెడిపోయి ఉండేవని నర్సు నాతో  చెప్పింది. అంతేగాక మరో రెండ్రోజుల పాటు నన్ను అక్కడి ఉండాలని వివరించింది...’ అని తెలిపాడు. 

అంతేగాక.. ‘నర్సులు నాకు  రెగ్యులర్ చెకప్స్ చేశారు. నా చుట్టూ నర్సులు పరీక్షలు చేస్తున్నా.. నా పరిస్థితి బాగాలేకున్నా మైండ్ లో మాత్రం నేను తర్వాత జరగబోయే సెమీస్ గురించే ఆలోచిస్తున్నాను. నేను త్వరగా వెళ్లి మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తాననే అనుకుంటున్నాను.

నేను సెమీస్ ఆడాలని డాక్టర్ భావిస్తున్నట్టు ఆయన నాతో చెప్పాడు. అదే నాకు బూస్ట్ ఇచ్చింది. కానీ తర్వాత ఆయనే వచ్చి.. రిజ్వాన్ నువ్వు మ్యాచ్ ఆడే పరిస్థితుల్లో లేవని చెప్పినప్పుడు నన్ను నిరాశ నిస్ప్రుహలు ఆవహించాయి. కానీ  ఆ తర్వాత నేను వేగంగా కోలుకోవడంతో  సెమీస్ ఆడగలిగాను..’ అని చెప్పాడు. 

హాస్పిటల్ నుంచి వచ్చి నేరుగా మ్యాచ్ ఆడిన రిజ్వాన్ సెమీస్ లో యోధుడిలా పోరాడాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రిజ్వాన్, ఫకర్ జమాన్ రాణించడంతో పాకిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. కానీ ఆసీస్ బ్యాటర్లు విజృంభించడంతో పాకిస్థాన్ సెమీస్ లోనే నిష్క్రమించింది. 

click me!