రోహిత్ ఆట నానాటికీ దిగజారుతోంది.. మరీ గత వరల్డ్ కప్ లో అయితే.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

First Published Jan 13, 2023, 10:54 AM IST

Rohit Sharma: టీమిండియా సారథి  రోహిత్ శర్మ  జట్టును సమర్థవంతంగానే నడిపిస్తున్నా  బ్యాటింగ్ లో మాత్రం విఫలమవుతున్నాడు. అతడిలో  మునపటి ఆట లోపించిందని  గంభీర్  కామెంట్స్ చేశాడు. 

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్ గా  టన్నుల కొద్దీ పరుగులు చేసిన   రోహిత్ శర్మ సారథిగా నియమితుడయ్యాక  నెమ్మదించాడు. అడపాదడపా  కొన్ని మంచి ఇన్నింగ్స్ తప్ప ప్రతీ మ్యాచ్ లోనూ రావడం.. రెండు, మూడు సిక్సర్లు బాదడం..  పెవిలియన్ కు చేరడం.. ఏడాదిన్నరకాలంగా హిట్ మ్యాన్ ది ఇదే తంతు. 

గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ తో పాటు ద్వైపాక్షిక సిరీస్ లలో  కూడా రోహిత్ బ్యాటింగ్  తేలిపోయింది.  శ్రీలంకతో  వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో 87 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయిన  రోహిత్ రెండో వన్డేలో విఫలమయ్యాడు. అంతర్జాతీయ కెరీర్ లో అతడు  సెంచరీ చేసి  రెండేండ్లు దాటిపోయింది.   దీంతో అతడి బ్యాటింగ్ పై టీమిండియా ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. 

నిన్నటి మ్యాచ్ ముగిసిన తర్వాత   టీమిండియా మాజీ ఆటగాళ్లు  గౌతం గంభీర్,  సంజయ్ మంజ్రేకర్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.   గంభీర్ మాట్లాడుతూ.. ‘బహుశా కెప్టెన్సీ భారం వల్లో ఏమో గానీ రోహిత్ గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.    కెప్టెన్ గా అతడిపై భారీ అంచనాలున్నాయి. 

అయితే అతడు జట్టు ప్రదర్శనకు బాధ్యుడవుతాడు. చాలా విషయాలు  చూసుకోవాల్సి వస్తుంది. ఆ ఒత్తిడి వల్లే విఫలమవుతున్నట్టున్నాడు.   గతేడాది  టీ20   ప్రపంచకప్ లో రోహిత్ ఆట మరీ తీసికట్టుగా ఉంది...’అని చెప్పాడు.

సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి గత కొంతకాలంగా  రోహిత్ పరిమిత ఓవర్ల కంటే టెస్టు క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తున్నది. ఇంగ్లాండ్ తో  టెస్టు సిరీస్ లో  రోహిత్  మెరుగ్గా ఆడాడు.  కానీ ఇటీవల కొంతకాలంగా చూస్తే  వైట్ బాల్ క్రికెట్ మీద  కూడా అతడు బాగానే ఆడుతున్నాడు.  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా రోహిత్ అప్రోచ్ బాగుంది..’అని వ్యాఖ్యానించాడు. 

అంతర్జాతీయ కెరీర్ లో  రోహత్.. 2021 సెప్టెంబర్ 2న సెంచరీ చేశాడు.  ఇంగ్లాండ్ తో టెస్టులో  రోహిత్ సెంచరీ  సాధించాడు. ఇక వన్డేలోల రోహిత్.. 2020 జనవరి  19న  ఆస్ట్రేలియాతో   శతకం చేశాడు. ఆ తర్వాత మళ్లీ వన్డేలలో మూడంకెల స్కోరుకు చేరలేదు.  టీ20లలో అయితే రోహిత్ చివరి శతకం 2018లో వెస్టిండీస్ పై నమోదైంది. 

click me!