కొత్త స్పిన్నర్‌ను తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తే ఇండియాలో కుదరదు.. ఎలా ఆడాలంటే.. : ఆసీస్‌కు గిల్లీ కీలక సూచనలు

First Published Jan 17, 2023, 5:44 PM IST

Border-Gavaskar Trophy: వచ్చే నెలలో  ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది.   ఇరు జట్ల మధ్య జరిగే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా నాలుగు టెస్టులతో పాటు  మూడు వన్డేలు జరుగుతాయి. 

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య టెస్టు సమరానికి  దాదాపు మూడు వారాలకు మించే  సమయమున్నది.  ఇప్పటికే జట్టును ప్రకటించిన  ఆస్ట్రేలియా.. అందుకు తగ్గ వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నది. ఈ క్రమంలో కంగారూ జట్టు మాజీ ఆటగాళ్లు భారత్ లో భారత్ ను ఓడించడమెలా..? అన్నదానిమీద  కమిన్స్ సేనకు సూచనలు చేస్తున్నారు. 

1969 నుంచి  భారత్ - ఆస్ట్రేలియాలు  టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. కాలక్రమంలో ఈ సిరీస్ కు  బోర్డర్-గవాస్కర్ అని పేరు మార్చారు. అయితే భారత్ లో  జరిగే టెస్టులలో  టీమిండియాను ఓడిండచం ఆసీస్ కు శక్తికి మించిన భారమైంది.  ప్రపంచాన్ని గెలిచిన స్టీవ్ వా సారథ్యంలోని  ఆసీస్ జట్టు కూడా భారత్ లో భారత్ ను ఓడించలేదు.  

ఈ రెండు జట్ల మధ్య  టెస్టు సిరీస్ మొదలైనప్పట్నుంచీ  కేవలం ఒక్కసారే కంగారూలు  సిరీస్ ను సొంతం చేసుకున్నారు. అప్పుడు  వాస్తవానికి సారథి రికీ పాంటింగ్ కానీ కొన్ని కారణాల వల్ల  అప్పటి వికెట్ కీపర్  ఆడమ్ గిల్‌క్రిస్ట్   సారథిగా వ్యవహరించాడు.   2004లో గిల్‌క్రిస్ట్  సారథ్యంలోని కంగారూలు టైటిల్ నెగ్గారు. ఇప్పుడు అదే గిల్లీ (గిల్‌క్రిస్ట్ ముద్దుపేరు)  వచ్చే నెలలో భారత్ కు రానున్న  కమిన్స్ సేనకు కీలక సూచనలు చేశాడు. 

ఫాక్స్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లీ మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం ఈసారి సిరీస్ ను వాళ్లు (ఆస్ట్రేలియా) గెలుస్తారు.  వాళ్లను చూస్తే 2004 టీమ్ గుర్తుకువస్తున్నది.  తుది  జట్టు కూర్పు ఎలా ఉండనుందో గానీ.. నాటి, నేటి జట్టుకు దగ్గరిపోలికలున్నాయి. 

భారత్ కు వెళ్లే విదేశీ టీమ్ లు వాళ్లు ఇంతవరకూ వాడని స్పిన్నర్ ను వెంట తీసుకెళ్తాయి. అక్కడ సదరు స్పిన్నర్ ఏదైనా మాయ చేస్తాడని  టీమ్ లు భావిస్తాయి. కానీ అది వృథా ప్రయాస.  నన్నడిగితే  ఆసీస్ ఈ సిరీస్ కు తమ జట్టులోని నలుగురు అత్యుత్తమ బౌలర్లతో ఆడించాలి. అందులో ముగ్గురు సీమర్లు, ఒక  ప్రధాన స్పిన్నర్ ఉండాలి. 

సీమర్లు సరైన నియంత్రణలో బౌలింగ్ చేస్తూ   రివర్స్ స్వింగ్ రాబడితే అక్కడ వికెట్లు సాధించొచ్చు. ఎలాగూ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఉన్నాడు కాబట్టి స్పిన్ కు పెద్ద ఇబ్బందేమీ లేదు. ఈసారి  ఆస్ట్రేలియా విజయం సాధించగలదనే నమ్ముతున్నా....’ అని అన్నాడు. 

ఇదిలాఉండగా ఉపఖండంలో పిచ్ లను పరిగణనలోకి తీసుకుని ఈసారి ఆస్ట్రేలియా తన జట్టులో నలుగురు స్పిన్నర్లను చేర్చింది. వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ తో పాటు  అస్టన్ అగర్,  మిచెల్ స్పెప్సన్ లు స్పిన్నర్లే, వీరితో పాటు ఇటీవల దేశవాళీలో అదరగొడుతున్న కొత్త కుర్రాడు టాడ్ మర్ఫీని కూడా జట్టులో చేర్చింది. స్పిన్ పిచ్ లకు అనుకూలంగా ఉండే భారత్ లో  స్పిన్నర్ల తోనే భారత బ్యాటర్లకు షాకులివ్వాలని ఆసీస్ కుతూహలంగా ఉంది. 

ఇక 2004లో తమ జట్టు సాధించిన విజయం గురించి గుర్తు చేసుకుంటూ.. ‘అప్పట్లో మేం మైండ్ సెట్ ను మార్చుకుని   విజయం సాధించాం. ఇప్పుడు ఆస్ట్రేలియన్లు ఏం చేస్తారో చూడాలి. తొలి బంతి నుంచే అక్కడ  స్టంప్ లపై దాడి చేయాలి. మీ అహంకారాన్ని కొంచెం తగ్గించుకోండి. దూకుడుగా ఆడండి.   ఒక్క స్లిప్  తో ఆడేందుకు యత్నించండి.. ఫీల్డర్లను బౌండరీ లైన్ కు దగ్గరగా మొహరించండి.  చాలా ఓపికగా ఉండండి..’ అని కీలక సూచనలిచ్చాడు.  

click me!