బాబర్ ఆజమ్‌కు క్రికెట్‌పై అవగాహన లేదు.. పాక్ మాజీ స్పిన్నర్ షాకింగ్ కామెంట్స్

First Published Jan 8, 2023, 12:45 PM IST

పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్  ఇటీవల స్వదేశంలో  విమర్శలపాలవుతున్నాడు.  బాగా ఆడినా ఆడకున్నా అతడిపై విమర్శలు మాత్రం తగ్గడం లేదు.   న్యూజిలాండ్  తో సిరీస్ లో పాకిస్తాన్ రెండో టెస్టును డ్రా చేసుకున్న అనంతరం... 

పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్..  రెండో టెస్టును గెలిచినంత పనిచేసింది.  రెండో టెస్టు చివరి రోజు  మూడు ఓవర్లలో  15 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న తరుణంలో  వెలుతురు లేని కారణంగా  పాక్  ఓటమి నుంచి తప్పించుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా డ్రాతో సరిపెట్టుకుంది. సిరీస్ కూడా ఫలితం తేలకుండానే ముగిసింది. 

అంతకుముందు ఇంగ్లాండ్ తో  కూడా మూడు టెస్టులలో ఒక్కటంటే ఒక్కటీ గెలవక  చతికిలపడ్డ పాకిస్తాన్ పై  గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ముఖ్యంగా జట్టు సారథి బాబర్ ఆజమ్ పై  దేశ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతడు టెస్టుల నుంచి తప్పుకోవాలని   కొంతమంది అంటే మరికొంతమంది  టెస్టు సారథ్యం నుంచి తప్పుకుని జట్టులో కొనసాగితే మేలని అభిప్రాయపడుతున్నారు. 
 

తాజాగా ఇదే విషయమై పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా  స్పందించాడు.  బాబర్ ఆజమ్ కు  క్రికెట్ పై అవగాహన లేదని, అతడి షాట్ సెలక్షన్ అత్యంత చెండాలంగా ఉంటుందని వాపోయాడు. అందుకే  ప్రతీసారి బాబర్ అనవసరపు బంతులకు కూడా అవుట్ అవుతున్నాడని అన్నాడు. 

కనేరియా మాట్లాడుతూ..‘నాకు తెలిసి బాబర్ కు క్రికెట్ మీద అవగాహన లేనట్టుంది.  బ్యాక్ ఫుట్ షాట్స్ ఆడుతున్నప్పుడు అతడు అవుట్ అవుతున్నాడు. ఈ సిరీస్ (న్యూజిలాండ్ తో) లో పాకిస్తాన్ లక్కీగా ఓడలేదు కాబట్టి సరిపోయింది గానీ లేకుంటే కథ మరో విధంగా ఉండేది.  లోకల్ బాయ్స్  సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ లు జట్టును కాపాడారు.. 

వరల్డ్ క్లాస్ బ్యాటర్ అంటున్న బాబర్ ఆజమ్  మరోసారి విఫలమయ్యాడు. అదీ ఆఫ్ స్పిన్నర్ల  బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడుతూ.. పాకిస్తాన్ కు అవసరమున్న  సందర్భంలో అతడు ప్రతీసారి  ఫెయిల్ అయ్యాడు.  బ్యాటర్ గానే కాకుండా  కెప్టెన్ గా కూడా  బాబర్ ఈ సిరీస్ లో విఫలమయ్యాడు. 

బాబర్ ను సారథిగా తప్పించి తిరిగి ఆ బాధ్యతలు  మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్ కు అందించాలి. సారథికి  అతడు బెస్ట్ ఛాయిస్. యువ ఆటగాడు సౌద్ షకీల్ కు  వైస్ కెప్టెన్సీ అందించాలి.  అతడు ఇటీవలే జట్టులోకి వచ్చినా పాకిస్తాన్ ను భవిష్యత్ లో నడిపించే నాయకుడు అవుతాడు..’ అని  తన యూట్యూబ్ ఛానెల్ లో  వ్యాఖ్యానించాడు. 

click me!