ముందు ధోనీ, తర్వాతే దేశం! అందుకే రిటైర్మెంట్ ఇచ్చా... సురేష్ రైనా కామెంట్...

First Published Feb 5, 2023, 4:53 PM IST

టీమిండియా తరుపున ఆడిన మ్యాచుల్లో కంటే ఐపీఎల్‌లో బాగా ఆడిన ప్లేయర్లలో సురేష్ రైనా కూడా ఒకడు. ఆ మాటకి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ విషయంలో మినహాయింపు కాదు. ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన రోజే, తాను కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అభిమానులను ఆశ్చర్యపరిచాడు సురేష్ రైనా... ఇన్నాళ్లకు తన నిర్ణయానికి గల కారణాన్ని బయటపెట్టాడు రైనా...

 2005లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన సురేష్ రైనా, 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్ సురేష్ రైనానే. మూడు ఫార్మాట్లలో కలిపి 8 వేల పరుగులు చేసిన సురేష్ రైనా, బౌలింగ్‌లో 62 వికెట్లు పడగొట్టాడు..

అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అత్యంత ఆప్తుడిగా రైనాకి గుర్తింపు ఉంది. కొన్నాళ్ల పాటు టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన రైనా, 11 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడి నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు...

MS Dhoni, Suresh Raina

‘నేను, ధోనీ కలిసి చాలా మ్యాచులు ఆడాం. టీమిండియాకి, చెన్నై సూపర్ కింగ్స్‌కి కలిసి ఆడి ఎన్నో మ్యాచులు గెలిపించాం కూడా. ధోనీతో కలిసి టీమిండియాకి ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండేది...

నేను ఘజియాబాద్ నుంచి వచ్చాను, ధోనీ, రాంఛీ నుంచి వచ్చాడు. నేను మొదట ధోనీ కోసం ఆడాడు, ఆ తర్వాత దేశం కోసం ఆడాను. అదే నాకు, ధోనీకి ఉన్న కనెక్షన్. మేం ఇద్దరం కలిసి ఎన్నో ఫైనల్స్ ఆడాడు. వరల్డ్ కప్ గెలిచాం. అతను గొప్ప లీడర్, అంతకుమించి మంచి మనిషి..

MS Dhoni, Suresh Raina

అందుకే ధోనీ రిటైర్మెంట్ ఇవ్వగానే నేను కూడా రిటైర్ అవుతున్నట్టు ప్రకటించా. ధోనీ లేకుండా ఆడలేమోనని అనిపించింది. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నా... మాహీపై నాకున్న ప్రేమను ఆ విధంగా చాటుకున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా..

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ 2011 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సురేష్ రైనా, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడాడు. ఫామ్‌లో ఉన్న యూసఫ్ పఠాన్‌ని ఆడించడం కంటే, స్నేహితుడు కావడం వల్లే సురేష్ రైనాకి ధోనీ ఎక్కువ అవకాశాలు ఇచ్చాడని యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. 

2020 ఆగస్టు 15న ధోనీ రిటైర్మెంట్ ప్రకటన రాగానే... ‘నీ అడుగు జాడల్లోనే నేను వస్తున్నా’ అంటూ సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు..  ధోనీ రిటైర్మెంట్ కారణంగా రైనాని ఎవ్వరూ పట్టించుకోలేదు..

అయితే ఐపీఎల్ 2020 సమయంలోనే రైనా, ధోనీ మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2021 సీజన్‌లో చాలా మ్యాచులకు రిజర్వు బెంచ్‌లో పరిమితమైన సురేష్ రైనాని, ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్‌లో 5 వేలకు పరుగులు చేసిన రైనా, అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.. 

click me!