మాహీ చేసిందేం లేదు! అలా చేయమని చెప్పింది నేను... 2007 పాక్‌తో బాల్- అవుట్ మ్యాచ్‌పై వీరేంద్ర సెహ్వాగ్...

First Published Jun 4, 2023, 12:48 PM IST

కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్‌లో కూడా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2023 ఐపీఎల్ టైటిల్ విజయంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ పాత్ర ఎంతనే విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది...
 

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 22 పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ అయ్యాడు. దీంతో మిగిలిన ప్లేయర్ల సక్సెస్‌ని ధోనీ తన క్రెడిట్‌గా మార్చుకుంటున్నాడనే ట్రోల్స్ వస్తున్నాయి...
 

తాజాగా 2007 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన బాల్-అవుట్ మ్యాచ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 36 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాబిన్ ఊతప్ప 39 బంతుల్లో 50 పరుగులు, మహేంద్ర సింగ్ ధోనీ 31 బంతుల్లో 33 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 15 బంతుల్లో 20 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది టీమిండియా...

పాకిస్తాన్ ఈ లక్ష్యఛేదనలో వరుస వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా వుల్ హక్ ఒంటరి పోరాటంతో 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. చివరి బంతికి మిస్బా వుల్ హక్ రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. విజేతని నిర్ణయించేందుకు బాల్-అవుట్‌ని ఎంచుకున్నారు అంపైర్లు...

ఫుట్‌బాల్‌లో షుటౌట్‌ మాదిరిగా ఇరు జట్ల నుంచి ఐదుగురు బౌలర్లు వికెట్లను గిరాటేయాల్సి ఉంటుంది. భారత జట్టు నుంచి వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప మొదటి మూడు ప్రయత్నాల్లో వికెట్లను పడగొట్టగా పాకిస్తాన్ బౌలర్లు ముగ్గురూ వికెట్లను మిస్ చేశారు. దీంతో టీమిండియాకి 3-0 తేడాతో విజయం దక్కింది...

‘టీ20 వరల్డ్ కప్ 2007లో మేం ఆడిన మొదటి మ్యాచ్ బాల్‌-అవుట్‌గా ముగిసింది. నేను ధోనీ దగ్గరికి వెళ్లి, నేనే మొదట వేస్తానని చెప్పాను. కచ్ఛితంగా వికెట్లను పడగొట్టగలనని నమ్మకం ఉందని చెప్పాను. అంతేకాదు బౌలర్లకు ఇవ్వద్దని కూడా చెప్పా...
 

నా సలహాకి ధోనీ షాక్ అయ్యాడు. ఎందుకు బౌలర్లకు ఇవ్వొద్దని అడిగాడు. రన్నప్‌లో వాళ్లు వికెట్లను సరిగ్గా చూడలేరు, కచ్చితంగా మాస్ అవుతారు. వార్మప్ మ్యాచుల్లో, ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలాసార్లు ఇలా జరిగిందని వివరించా. దానికి ధోనీ సరేనన్నాడు.  
 

పొట్టి ప్రపంచకప్‌లో ప్రాక్టీస్ సెషన్స్‌లోనే బాల్-అవుట్‌ని ప్రాక్టీస్ చేశాం. నేను, సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ ఎక్కువగా వికెట్లను పడగొట్టాం. అందుకే రెగ్యూలర్ బౌలర్లను కాకుండా మేమే బాల్‌-అవుట్‌లో బౌలింగ్‌కి వచ్చాం. పాకిస్తాన్ మాత్రం ఈ మ్యాజిక్‌ని మిస్ అయ్యింది... ఆ విజయంలో పూర్తి క్రెడిట్ నాదే... వికెట్ల వెనకాల కూర్చోవాలనే ఆలోచన మాత్రం ధోనీదే...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

click me!