మన సంసారమే సక్కగ లేదు.. వేరేవాళ్లు రావడానికి భయపడరా..? ఆసియాకప్ వివాదంపై పాక్ మాజీ పేసర్ కామెంట్స్

First Published Jun 4, 2023, 11:50 AM IST

Asia Cup 2023: ఆసియా కప్ వివాదంపై   చర్చోపచర్చలు సాగుతున్న వేళ  పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. పాకిస్తాన్‌కు  వచ్చి ఆడేది లేదని ఇదివరకే చాలాసార్లు తేల్చి చెప్పిన బీసీసీఐ.. తాజాగా పాక్  ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ పై కూడా  పెదవి విరుస్తున్నది. బీసీసీఐతో పాటు  శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కూడా  ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. 

Image credit: Getty

ఈ నేపథ్యంలో ఆసియా కప్ ను  శ్రీలంకకు తరలిస్తారని వస్తున్న ఊహాగానాలకు పాకిస్తాన్  క్రికెట్ బోర్డు ఉక్కిరిబిక్కిరవుతోంది.  అలా అయితే పాకిస్తాన్  ఆసియా కప్ టోర్నీని బహిష్కరిస్తుందని  హెచ్చరికలు జారీ  చేస్తున్నది.  శ్రీలంకలో గనక ఆసియా కప్ ను నిర్వహిస్తే ఈ టోర్నీతో పాటు ఈ ఏడాది అక్టోబర్ లో  భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో కూడా  పాల్గొనేది లేదని  పీసీబీ  హెచ్చరిస్తున్నది. 

అయితే పీసీబీ నిర్ణయాన్ని స్వయంగా ఆ దేశానికి చెందిన క్రికెటర్లే తప్పుబడుతున్నారు.  తాజాగా ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అసిఫ్..  పాకిస్తాన్ లో పరిస్థితులు చూస్తుంటే  ఏ జట్టు అయినా  ఇక్కడికి రావడానికి సందేహిస్తుందని  వ్యాఖ్యానించాడు.  ఆసియా కప్  పాక్ లో జరుగడం కలేనని కూడా చెప్పాడు. 

‘ది టువెల్త్ మ్యాన్’ అనే యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసిఫ్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసినంతమేరకు  ఆసియా కప్ ఇక్కడ (పాకిస్తాన్) లో జరుగదు.  ఎందుకంటే పాకిస్తాన్ లో  రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దేశంలో ఇలాంటి పరిస్థితులుంటే ఏ  దేశం అయినా వారి జట్టును పంపడానికి ఎలా ఒప్పుకుంటుంది..? 

ఈసారి ఆసియా కప్ అయితే  కచ్చితంగా పాకిస్తాన్ లో జరుగదు.  ఈ ఏడాది శ్రీలంక లేదా దుబాయ్‌ లో జరిగే అవకాశాలున్నాయి..’ అని చెప్పాడు.  కాగా  పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు  నేపథ్యంలో అక్కడ అల్లర్లు చెలరేగాయి. దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు   రోడ్లమీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. 

దీనికి  తోడు పాకిస్తాన్ లో  ఆర్థిక మందగమనంతో  ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇదే అదునుగా  తీవ్రవాద సంస్థలు  కూడా అక్కడ హింసకు ఆజ్యం పోసేవిధంగా వ్వవహరిస్తున్నాయి.  ఇన్ని అవంతరాలు ఉండబట్టే   ఆసియా కప్ మరో దేశానికి తరలిపోతుందని పాక్ మాజీ క్రికెటర్లు కూడా వాపోతుండటం గమనార్హం. 

click me!