ముంబై టీమ్ బౌలింగ్ కోచ్‌గా జులన్ గోస్వామి..! తేల్చేసిన బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్

First Published Feb 1, 2023, 4:46 PM IST

WPL:  వచ్చే నెల నుంచి మొదలుకాబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో  భాగంగా  ఫ్రాంచైజీలను దక్కించుకున్న టీమ్‌లు  అందుకు తగ్గ సన్నాహకాలు  ముమ్మరం చేశాయి. ఈ నెల రెండో వారంలో  వేలం జరుగనున్న ఈ  లీగ్ లో మాజీ భారత క్రికెటర్లు కూడా భాగమవుతున్నారు. 

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనబోయే ఫ్రాంచైజీలు  వచ్చే నెలలో జరుగబోయే ఈ లీగ్ కోసం  ప్రిపరేషన్స్ ముమ్మరం చేశాయి.  బీసీసీఐ.. గత నెలలో  ఫ్రాంచైజీలను దక్కించుకున్న ఐదు టీమ్ ల వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.  

ముంబై, బెంగళూరు,  అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలు ఫ్రాంచైజీలుగా ఎంపికయ్యాయి.   ముంబై (అంబానీ), బెంగళూరు (ఆర్సీబీ), ఢిల్లీ (ఢిల్లీ క్యాపిటల్స్)  లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోగా  అహ్మదాబాద్ ఫ్రాంచైజీని ప్రముఖ  వ్యాపారవేత్త గౌతం అదానీ, లక్నో టీమ్ ను  క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ వాళ్లు సొంతం చేసుకున్నారు.   అహ్మదాబాద్ టీమ్ ఇదివరకే తమ  జట్టుకు మెంటార్ గా భారత మాజీ సారథి  మిథాలీ రాజ్ ను నియమించుకున్న విషయం తెలిసిందే. 

తాజాగా మరో భారత  మాజీ క్రికెటర్, గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న జులన్ గోస్వామి కూడా ఈ లీగ్ లో భాగం కాబోతుంది.  ఆమె  అంబానీ ఆధ్వర్యంలోని   ముంబై  ఫ్రాంచైజీకి బౌలింగ్ కోచ్ గా చేయనున్నట్టు తెలుస్తున్నది.  ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే వెల్లడించాడు. 

ఈడెన్ గార్డెన్స్ లో  తనను కలిసిన విలేకరులతో దాదా మాట్లాడుతూ ఈ విషయాన్ని  ప్రకటించాడు.  డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ టీమ్ కూడా  ఫ్రాంచైజీ  కొన్న విషయం తెలిసిందే. మెన్స్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు దాదా డైరక్టర్ గా ఉన్నాడు. అయితే   డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ టీమ్ కు సేవలందించడానికి జులన్  ను తీసుకుంటారా..? అని విలేకరులు దాదాను  అడిగారు. 

దానికి దాదా మాట్లాడుతూ.. ‘లేదు. జులన్  ముంబై ఫ్రాంచైజీలో భాగం కాబోతుంది.  మేం జులన్ కు మంచి ఆఫర్ ఇచ్చాం. కానీ  ఆమె అంతకుముందే ముంబైతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది..’అని గంగూలీ చెప్పాడు.  అయితే  అటు జులన్ గానీ ఇటు ముంబై ఫ్రాంచైజీ గానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన చేయలేదు. 

ఇక డబ్ల్యూపీఎల్ లో  ఫ్రాంచైజీల  ప్రకటన ముగిసిన తర్వాత  ప్రక్రియ వేలం.  ఈ నెల రెండో వారంలో ఢిల్లీ వేదికగా  డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహించనున్నట్టు  బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మార్చి మొదటివారంలో ఈ  లీగ్ తొలి సీజన్ మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

click me!