చివరిసారిగా 2014లో ఐపీఎల్ ఆడాడు ఛతేశ్వర్ పూజారా. పంజాబ్ జట్టు తరుపున ఆడిన పూజారా, అంతకుముందు 2011, 12, 13 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడాడు..
2014 నుంచి ప్రతీ సీజన్‌లో ఐపీఎల్ వేలానికి పేరు నమోదుచేసుకుంటున్నా, పూజారాను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ సాహసించలేదు. ఈసారి మాత్రం సీఎస్‌కే ముందుకొచ్చి, పూజారాను బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది.
‘నేను టెస్టులు మాత్రమే ఆడగలనని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేను అన్ని ఫార్మాట్లు ఆడగలను. ఈసారి దక్కిన అవకాశాన్ని దాన్ని నిరూపించేందుకు వాడతాను...
అయితే ఐపీఎల్ వేలంలో ఎప్పుడూ నేను అమ్ముడుపోనందుకు బాధపడలేదు. కానీ 2016, 17 సీజన్లలో నా సొంత రాష్ట్రమైన గుజరాత్ జట్టు గుజరాత్ లయన్స్ కూడా నన్ను తీసుకోకపోవడం చాలా బాధపెట్టింది...
రెండు సీజన్లలోనూ వారు నన్ను కొనుగోలు చేయలేదు. అయితే అదంతా గతం... ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నా... నేనేం చేయగలనో చూపిస్తాను’ అంటూ కామెంట్ చేశాడు పూజారా...
పూజారాను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయడంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వినిపించింది. టీ20లను టెస్టు తరహాలో ఆడే సీఎస్‌కేకి సరైన ప్లేయర్ పూజారానే అని ట్రోల్ చేశారు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్న పూజారా, ఐపీఎల్ 2021 సీజన్‌ను అందుకు మార్గంగా ఎంచుకోవాలని భావిస్తున్నాడు.